సుడి`గాలి' ప్రచారం!
హైదరాబాద్: నేతలు ఇక భూమ్మీద నడవరు. గాలిలోంచి వస్తారు. గాలిలోనే ఎగురుతారు. సీజను అలాంటిది. సుడిగాలి దుమారంలా చెలరేగిపోవాలి. ముఖ్యమంత్రి కుర్చీ అంటే మజాకా కాదుగా. కాలంతో పరుగులు పెట్టకపోతే ప్రచారంలో వెనకబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎన్నికల తేదీలు తరుముకొస్తున్న కొద్దీ ఆంధ్రదేశ రాజకీయ నాయకులు `గాలి' మీదే ఆధారపడుతున్నారు. జాతీయ పార్టీల నేతలే కాదు ప్రాంతీయపార్టీల నాయకులు, వారివారి తరపున ప్రచారం చేయడానికి ముందుకు వచ్చిన వారూ కూడా గాలిబాట లోనే ప్రయాణించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దానికి తోడు ఈసారి ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. వెండితెర మీద వెలుగుతున్న నటీ నటులు జనం మధ్యకు వచ్చేస్తున్నారు.
ప్రచారానికి రాజకీయ పార్టీల నాయకులంతా హెలికాప్టర్ల కోసం వెంటపడుతున్నారు. ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హెలికాప్టర్లను వాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్, మహాకూటమి సారధి చంద్రబాబుకు హెలికాప్టర్లను ప్రచారానికి వాడటం కొత్తేమీ కాదు. మొదట్లో చైతన్య రధాలు, రాజీవ్ నగరబాట రధాల పేరుతో వ్యానులను వినియోగించినా ఇప్పడు హెలికాప్టర్లను వినియోగించక తప్పదు ఈ అగ్రనేతలకు. తెరాస అధినేత కేసిఆర్ కూడా ఇప్పుడు హెలికాప్టర్లో తెలంగాణాతో పాటు మహాకూటమి తరఫున ఆంధ్ర ప్రాంతాన్ని కూడా చుట్టిముట్టి రావడానికి సిద్ధపడుతున్నారు. తొలిసారిగా రాజకీయ ప్రచార రంగంలోకి దూకుతున్న యువ కిశోరం జూనియర్ ఎన్టీఆర్ తన పర్యటన అంతా హెలికాప్టర్లోనే కొనసాగించనున్నారు.
ఇంక ప్రజలకు అంతులేని ఆనందాన్ని పంచి ఇచ్చే సినిమా నటుల, నటీమణుల సందర్శనం ఎన్నికల ప్రచారం పుణ్యమా అని మరింత సులభతరం అవుతోంది. తెలుగుదేశం తరఫున ఇప్పటికే రోడ్ షోలు నిర్వహించిన బాలకృష్ణ మరో సారి ఆంధ్రదేశ ప్రజల ముంగిటకు రానున్నారు. ఈనెల 8వ తేదీన బాలయ్య యాత్ర ప్రారంభమై ఎకాఎకీ 800 కిలోమీటర్లు సాగనున్నది. ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో వీలైనంత త్వరగా రాష్ట్రాన్ని చుట్టిరావాలని ఆయన భావిస్తున్నారు. బాలయ్య ప్రసంగాలు అంతంతమాత్రంగానే ఉన్నా అతనిని చూడటానికి ప్రజలు బాగానే రావడం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆనందం కలిగిస్తోంది.
Pages: 1 -2- News Posted: 6 March, 2009
|