ఆల్ ఫ్రీ ! నో మనీ !!
హైదరాబాద్ : రంగుల టెలివిజన్ సెట్లు ఉచితం... కేబుల్ కనెక్షన్ ఉచితం... విద్యుత్ ఉచితం... పేదలకు వినోదం ఉచితం... నిరుపేదలకు నెలనెలా 2000 రూపాయలు ఉచితం... రైతులకు విద్యుత్ ఉచితం. జ్వరం నుంచి ఆపరేషన్ వరకూ ఏ అనారోగ్యమైనా చికిత్స ఉచితం. ఆల్ ఫ్రీ. నో మనీ. ఆకాశంలో చంద్రుణ్ణి అందంగా చూపెట్టే చంద్రబాబు నజరానాలు.
ఇలాంటి చిన్న చిన్న ఉచితాలను పక్కన పెడితే సామాజికంగా వెనుకబడిన వారికి, పేద రైతులకు రెండున్నర నుంచి ఐదెకరాల భూమి ఉచితం... నిరుద్యోగులకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు ఉచితం. పదిగంటల నాణ్యమైన విద్యుత్ రైతులకు ఉచితం... నెలంతా సరిపడే వంటసరుకు వంద రూపాయలకే పంపిణీ. కుల, చేతి వృత్తులకు విద్యుత్ ఉచితం...ఇంటికి వాడే కరెంట్ సగం ఉచితం.. ఇవి `మెగా' ఉచితాలు.
అధికారాన్ని దక్కించుకోవడమే అంతిమ లక్ష్యంగా మన నాయకులు చేస్తున్న వాగ్దానాలను చూసి ఆర్ధిక శాస్త్రవేత్తలు, మేధావులు నిర్ఘాంతపోతున్నారు. రాష్ట్రం దివాళా తీసి ప్రజలు చివరకు నిజంగానే బిచ్చగాళ్ళుగా మారతారని హెచ్చరిస్తున్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో ప్రభుత్వానికి నిధులు సమకూర్చుతున్న పౌరుల సొమ్మును వోట్ల కోసం ఈ నాయకులు దుర్వినియోగం చేయడానికే ఈ పథకాలను ప్రకటిస్తున్నారని వారు వివరిస్తున్నారు. మానవ శక్తి వనరులలోను, ప్రకృతి వనరులతోను సుసంపన్నంగా ఉన్న ఆంధ్రరాష్ట్రంలో ఈ తరహ రాజకీయ పోకడలు చేటు కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.
తెలుగుదేశం, ప్రజారాజ్యం ఎన్నికల ప్రణాళికలు ధార్మక సంస్థల విధానాలుగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే వారి తప్పేం లేదు. ప్రజా ధనాన్ని సంతర్పణ చేసే హక్కు అధికారంలోకి వస్తే తమకు ఉందని రాజకీయ నాయకులు నమ్మతున్నారు. ఉచితానుచితాలు పక్కన పెట్టి ఉచిత హామీలు ఇచ్చేస్తున్నారు. ఈ నాయకులు కేవలం పదవి మీద ఆశతో రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను పట్టించుకోకుండా ఇస్తున్న హామీలు ప్రజలను దివాళా తీయంచే విధంగానే ఉన్నాయి.
Pages: 1 -2- News Posted: 9 March, 2009
|