పీఆర్పీ ప్రత్యేకత ఏంటి?
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) ముసాయిదా ఎన్నికల ప్రణాళిక పార్టీ కేడర్ కు ఏమాత్రం నచ్చలేదు. ముసాయిదా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన పిఆర్ పి తుది ప్రణాళికను ఖరారు చేసి విడుదల చేయాడానికి గాను జనాభిప్రాయాన్ని సేకరించి తమకు నివేదించవలసిందని కోరుతూ దాని ప్రతులను పార్టీ నాయకులకు, కేడర్లకు పంపింది. పార్టీ సుమారు 30 వేల కాపీలను ముద్రించి పార్టీ వర్గాలలో పంపిణీ చేసింది. సమాజంలోని వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవడానికై పార్టీ నాయకులు ఆయా వర్గాలతో సమాలోచనలు సాగిస్తున్నారు. ఇటీవల పార్టీ డాక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం వహించే గ్రూపులతో కూడా అటువంటి సమావేశాలు ఎక్కువగా పార్టీ నిర్వహించబోతున్నది.
ముసాయిదా పట్ల ప్రజారాజ్యం పార్టీ నాయకులు కొందరు అసంతృప్తి ప్రకటించారు. ప్రజల దృష్టిని ఆకర్షించగలిగే విధంగా అది మరింత నిర్దుష్టంగా ఉండి ఉండవలసిందని వారు అన్నారు. ఆ ముసాయిదాలో మౌళిక అంశాల ప్రస్తావనే లేదని, సమస్యలకు నిర్దుష్టమైన పరిష్కారాలను సూచించకుండా సందిగ్ధంతో ఉందని పార్టీ నాయకుడు అభిప్రాయం వెలిబుచ్చారు. మేనిఫెస్టోలో ప్రత్యేక చర్యలను, ప్రోత్సాహకాలను పార్టీ ప్రకటించి ఉండవలసిందని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఉదాహరణకు, పోలీసు సిబ్బందికి సర్వీసులో పదోన్నతులను, కానిస్టేబుల్స్ కు, హోమ్ గార్డులకు కొన్ని సౌకర్యాలను కల్పించగలమని వాగ్దానం చేసి ఉండవలసింది' అని ఆయన సూచించారు.
'పోలీసు కానిస్టేబుల్స్ లో చాలా మంది కానిస్టేబుల్స్ గానే రిటైరవుతుంటారు. వారికి వారి అర్హతలతో నిమిత్తం లేకుండా సబ్ ఇన్ స్పెక్టర్ దశ వరకు కాలానుగుణ పదోన్నతులు కల్పించగలమని వాగ్దానం చేస్తే కానిస్టేబుల్ చిత్తశుద్ధితో పని చేస్తారు' అని ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు. 'అదేవిధంగా,కావలసిన అర్హతలు ఉన్న హోమ్ గార్డులకు పోలీసు శాఖలో కానిస్టేబుల్స్ గా చేర్చుకునే అవకాశం కల్పించవచ్చు' అని ఆయన సూచించారు. టీచర్లకు సంబంధించినంత వరకు వారి పిల్లల వివాహానికి ఖర్చులు భరించేందుకు జీతం అడ్వాన్స్ సౌకర్యం కల్పిస్తే వారికి కొంత ధీమాతో వ్యవహరించగలరని మరొక నాయకుడు సూచించారు.
Pages: 1 -2- News Posted: 11 March, 2009
|