'రాజ్యం'లో పెరిగిన ధీమా
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ శ్రేణుల్లో రాజమండ్రి సభ నూతనోత్తేజాన్ని నింపింది. అంచనాలకు మించి జన రావడం పార్టీ వర్గాలకు సంతృప్తి కలిగించగా, ప్రత్యర్దులను కంగు తినిపించిందని అంటున్నారు. తన బలం తగ్గిందని జరుగుతున్న ప్రచారానికి ఇక తెర పడినట్టేనని పార్టీ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం గాలి వీస్తోందనిచెప్పడానికి ఇది ఉదాహరణ అని పార్టీ నాయకులు చెబుతున్నారు.రాజమండ్రి సభ విజయం ప్రభావం అన్ని జిల్లాలపై ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని అంచనా వేస్తున్నారు. మెగా సభకు జనం పోటెత్తడంతో ఇతర పార్టీల నాయకులు అనేకమంది ప్రజారాజ్యం వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఇక వలసలు మొదలవుతాయని పరిశాలకులు భావిస్తున్నారు. ఆ పార్టీల్లోని అసంతృప్తివాదులందరూ ప్రజారాజ్యంలో చేరడానికి ఉద్యుక్తులవుతున్నారు.
తమ పార్టీ ఈసారి బీసీలకే ఎక్కువ సీట్లు ఇస్తుందని చిరంజీవి చెప్పడంతో, ప్రజారాజ్యం పార్టీకి కుల ముద్ర వేయాలనుకున్న వారి ప్రయత్నాలకు చెక్ చెప్పినట్టయింది. చిరంజీవి అనవసర వాగ్దానాలు చేయకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని ప్రశంసిస్తున్నారు. రాజమండ్రి తరహాలోనే అన్ని జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. జిల్లా నాయకులు కూడా అందుకు సమాయత్తమవుతున్నారు. యువరాజ్యం, మహిళారాజ్యంలతో పాటు పార్టీ అనుబంధ సంస్థలన్నీ మెగా సభల పట్ల ఉత్సాహం చూపుతున్నాయి.
Pages: 1 -2- News Posted: 12 March, 2009
|