ఈసారి టిక్కెట్లు మరీ ఖరీదు!
హైదరాబాద్: పార్టీలకోసం సేకరిస్తున్న 'నిధులు', డబ్బు సంచులు ఈ సారి అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నాయి. కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న, మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే ఫలితాలు చెబుతున్న, కాంగ్రెస్ పార్టీ విరజిమ్మే 'డబ్బు సంచుల'కోసం ఎక్కడ పడితే అక్కడ అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. 'నాకు మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పిస్తే కోటి రూపాయలు ఇస్తాను' అంటూ ఒక ఆశావహుడు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరుగుతున్నాట్ట! మరి ఆయన నోటి దురద తీర్చుకుంటున్నాడో లేక టిక్కెట్ కోసం నిజంగానే డబ్బు సంచీతో తిరుగుతున్నాడో ఎవరికి తెలుసు? కాని, ఇప్పుడు జరగబోయేవి మాత్రం అత్యంత ఖరీదైన ఎన్నికలని ఏ నాయకుడిని కదిపినా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
'ఒక అసెంవ్లీ నియోజకవర్గానికి కనీసం రెండు కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాలి. పార్టీలు కూడా విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది' అని టిఆరెస్ నాయకుడొకరు చెప్పారు. కాంగ్రెస్ టిక్కెట్ల కోసం పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బూమ్ లో లెక్కకు మించి సంపాదించిన వారు కోట్లు గుమ్మరించడానికి సిద్ధపడుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 'కాంగ్రెస్ టిక్కెట్ కు గిరాకీ చాలా ఎక్కువగా ఉంది. ఆ తరువాత క్రమంలో మహాకూటమి, ప్రజారాజ్యం ఉన్నాయి. పార్టీల దృష్టిలో గెలుపు గుర్రాలంటే కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాడని అభ్యర్ధులన్న మాట' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 13 March, 2009
|