న్యూఢిల్లీ: భారత రాజకీయాలలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరం మార్పు ఎట్టకేలకు చోటు చేసుకుంటున్నది. 2009 లోక్ సభ ఎన్నికలు తదుపరి తరం ఆగమనానికి సూచిక కాగలవు. రానున్న సంవత్సరాలలో దేశ భవితవ్యానికి వారే మార్గదర్శకత్వం వహిస్తారు. అయితే ఇది ఒబామా ప్రభంజనాన్ని ప్రతిబింబించడం లేదు. 46 సంవత్సరాల నల్లజాతి వ్యక్తి ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు అయ్యారు. కాని మన దేశంలో రాజకీయ రంగంలో వయో పరిమితి కచ్చితంగా తగ్గుతున్నది. అధిక సంఖ్యాక పార్టీలలో విధాన నిర్ణేతలు 60లోపు వయస్సులోనే ఉన్నారు.
రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ ప్రధాని అభ్యర్థులుగా వెనుకటి తరం నాయకులనే ఎంపిక చేసినప్పటికీ ఈ మార్పు చోటు చేసుకుంటుండడం గమనార్హం. కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి డాక్టర్ మన్మోహన్ సింగ్ వయస్సు 77. బిజెపికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్.కె. అద్వానీ వయస్సు 82 సంవత్సరాలు. కాని ఎన్నికలు ముగిసిన తరువాత తదుపరి తరం నాయకులు అధికార పీఠంలో తమ వంతు స్థానాన్నిఆక్రమించడానికి ఇదేమీ ప్రతిబంధకం కాదు.