న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ పార్టీ అధినాయకత్వంపై అలిగారు. ఎన్నికల వ్యూహ రచనలో తిరుగులేని దిట్టగా బిజెపిలో పేరు గడించిన జైట్లీ తన అధికారాన్ని సవాలు చేసే విధంగా అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా అలకవహించారు. శుక్రవారం ఆయన (బిజెపి) ఎన్నికల కమిటీ దరిదాపుల్లోకే రాలేదు. దీనితో ఈ పరివార్ పార్టీలో వివిధ అంచెలలో సాగే స్పర్థలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అంతర్గత కలహాల కారణంగా జైట్లీ బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) సమావేశానికి గైర్ హాజరయ్యారు. వాణిజ్యవేత్త సుధాంశు మిట్టల్ ను పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అసోంలో పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించడమే జైట్లీ అలకకు కారణంగా తెలుస్తోంది.
మిట్టల్ నియామకమే నిప్పును రగిలించింది. కాని పార్టీలో ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ లతో సహా అనేక అంచెలలో నాయకుల మధ్య సాగే ఒత్తిళ్ళు కూడా జైట్లీ ఈ విధంగా అసంతుష్టిని ప్రదర్శించడానికి కారణమయ్యాయి. అద్వానీ తన మాట నెగ్గించుకుంటూ జైట్లీని బిజెపి ముఖ్య ఎన్నికల ప్రచారకుడుగా నియమింపజేశారు. ఈ పదవికి సంక్షిప్త నామం (సిఇసి) ఇటీవల మరొక వివాదానికి కేంద్ర బిందువైన రాజ్యాంగ పదవితో సారూప్యం ఉంది. బిజెపికి ఆనందం కలిగే విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎన్. గోపాలస్వామి తన సహచరుడు నవీన్ చావ్లాను తొలగించాలని ఇటీవల సిఫార్సు చేసిన విషయం విదితమే. శుక్రవారం జైట్లీ డుమ్మా కొట్టిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో కొందరు పార్టీ నాయకులు గంభీర వదనాలతోనే మాటల తూటాలు వదిలారు.
మిట్టల్ నియామకంపై విభేదాలు వంటి చిన్న సమస్య ఎందుకు మీడియాకు ప్రచారాంశం కావాలని మురళీ మనోహర్ జోషి ప్రశ్నించారు. మిట్టల్ కు సన్నిహితురాలుగా పేర్కొంటున్న సుష్మా స్వరాజ్, తనను తోసిరాజని జైట్లీకి ప్రచార కమిటీ సారథ్యం బాధ్యతలు అప్పగించడంతో కుమిలిపోతున్న వెంకయ్య నాయుడు ఈ కోరస్ తో గొంతులు కలిపారు. దీనితో 'అద్వానీజీ తీసుకున్న నిర్ణయాన్ని మనం అంతా అంగీకరించవలసి ఉంటుంది' అని జోషి అసలు తన మనోభావాలను కప్పిపుచ్చుకుంటూ వ్యాఖ్యానించారు.
మరెక్కడైనా అటువంటి ప్రకటనను అద్వానీకి అభినందనగా పరిగణించేవారేమో. కాని నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ సాగుతున్నప్పుడు జోషి వ్యాఖ్యను అద్వానీ మాటను శిరసావహించడానికి కొందరు సిద్ధంగా లేరనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నది. వాస్తవానికి రాజ్ నాథ్, జైట్లీ మధ్య ఎన్నడూ సుహృద్భావపూర్వక సంబంధాలు లేవు. ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది అయిన జైట్లీని పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పించినప్పుడు ఈ సంగతి మరింత ప్రస్ఫుటమైంది. శుక్రవారం ఈ సమావేశంలో పరిస్థితి జైట్లీకి వ్యతిరేకంగా మారిందని, చివరకు అద్వానీకి విశ్వాసపాత్రులు కూడా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గుడ్ బై చెప్పడం వంటి వ్యతిరేక పరిణామాలను బిజెపి ఎదుర్కొంటున్న సమయంలో ఆయన సమావేశానికి గైర్ హాజరై ఉండవలసింది కాదని అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.