లోకేష్ కు పార్టీ బాధ్యతలు
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ (టిడిపి)అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ నాయుడును క్రియాశీలక రాజకీయాలలోకి చాలా త్వరగానే ప్రవేశపెట్టవచ్చు. సినీ నటుడు, లోకేష్ కు మేనబావ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీలో 'ఇన్ స్టంట్' ఆమోదముద్ర లభించడమే ఇందుకు కారణం కావచ్చు. యువతరం నాయకుడైన జూనియర్ ఎన్టీఆర్ మూడు రోజూల పాటు సాగించిన ప్రచారం బహుదా ప్రశంసలు చూరగొన్నది. లోకేష్ నాయుడు పార్టీ వ్యవహారాలలో పాత్ర పోషించనున్నట్లు చంద్రబాబు నాయుడు ఆదివారం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 'అతను (లోకేష్ నాయుడు) తన సేవలు కావలసి వచ్చినప్పుడల్లా పార్టీకి చేయూత ఇవ్వగలడు' అని టిడిపి అధ్యక్షుడు చెప్పారు.
నగదు బదలీ పథకం (సిటిఎస్) ను పార్టీ ప్రకటించడానికి ప్రధాన బాధ్యుడు లోకేష్ నాయుడు అని చంద్రబాబు తెలిపారు. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు రూ. 1000 నుంచి రూ.2000 వరకు నగదు అందజేస్తారు. వాస్తవానికి తన కుమారుని రాజకీయాలలోకి లాగవద్దని మీడియాను చంద్రబాబు నాయుడు ఆమధ్య కోరారు. అయితే, చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రకటన చేయడంలో ఆంతర్యం వినూత్న పథకాల గురించి ఆలోచించగల సామర్థ్యం తన కుమారునికి ఉందని ప్రచారం చేయడమేనని పార్టీ నాయకులు భావిస్తున్నారు. 'ఎన్.టి. రామారావు, చంద్రబాబు నాయుడు లక్షణాలు జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ లలో కనిపించడం కాకతాళీయం' అని టిడిపి సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 16 March, 2009
|