నేమ్ ప్లేట్ వేటలో ఫ్రంట్!
న్యూఢిల్లీ: పేరులో ఏముంది? అంటారు కాని మూడో ఫ్రంట్ నాయకులు ఇప్పుడు దానికోసమే వెతుకులాడుతున్నారు. ఇటీవలే ఏర్పడిన ఫ్రంట్ కు ఆదివారం లభించిన సంఘీభావం, ఐక్యతా బలం నాయకులకు మంచి హుషారునిచ్చాయి. అందరూ భయపడినట్టుగా 'నాయకుడెవరు?' అన్న ప్రశ్న తలెత్తకపోవడం కూడా వారి హుషారుకు మరో కారణం. కేవలం 'తృతీయ ఫ్రంట్' అని పిలిపించుకోవడం ఇష్టపడక ఏ పేరు పెట్టాలా అన్న ఆలోచనలో పడ్డారు. వామపక్షాలు, జనతాదళ్(ఎస్), తెలుగుదేశం పార్టీలకు బిఎస్పీ అధినేత్రి మాయావతి ఇచ్చిన విందు, ఫ్రంట్ లో చేరడానికి అభ్యంతరం లేదంటూ బిజూ జనతా దళ్(బిజెడి), బాబూలాల్ మరాండి పంపిన లేఖల ఉత్తేజంతో సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ హుటాహుటిన దేవెగౌడను కలుసుకుని మూడో ఫ్రంట్ నామకరణం గురించి సుదీర్ఘ చర్చలు జరిపారు.
'తృతీయ ఫ్రంట్ అన్న పేరు చాలామందికి నచ్చలేదని, కొత్త పేరు పెట్టాలని కారత్ చెప్పారు. వాళ్లు నిర్ణయించిన ఏ పేరైనా నాకు ఇష్టమే' అని దేవెగౌడ చెప్పారు. ఆవిర్భావం నుండి అందరూ ఏవేవో వ్యాఖ్యానాలు చేయడం కూడా ఫ్రంట్ నేతలకు చివుక్కుమనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గత వారం కొత్త ఫ్రంట్ గురించి వ్యాఖ్యానిస్తూ 'పదిహేడో శతాబ్దంలో పవిత్రమైన రోమన్ సామ్రాజ్యం అని ఉండేది. కాని చరిత్రకారులు దానిలో పవిత్రత లేదు, రోమన్ అసలే లేదు, సామ్రాజ్యం అంతకంటే కాదు అని అభివర్ణించేవారు. అలా ఇప్పుడు మూడో ఫ్రంట్ అంటున్నారు. మరి ఒకటో ఫ్రంట్ ఏది? రెండో ఫ్రంట్ ఏది? ఎవరు చెప్పగలరు?' అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు.
Pages: 1 -2- News Posted: 17 March, 2009
|