'జయ హో'రు కర్ణకఠోరం!
ఢిల్లీ: భారతీయ సంగీత దర్శకుడికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బాణీ అది. దాన్ని వినిపించి, ముఖ్యంగా పట్టణాల్లోని యువ ఓటర్లను ఆకర్షించాలన్న కాంగ్రెస్ పార్టీ తాపత్రయం ఇప్పుడు బెడిసికొట్టింది. 'జయ హో' పాటకి అధికార పార్టీ తయారు చేయించిన పేరడీ ఎఫ్.ఎమ్.లు, టెలివిజన్ చానెళ్లలో హోరెత్తించేస్తూ 'ఎంత కర్ణ కఠోరంగా ఉంది!' అనిపించేస్తోంది. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకోసం ఎఆర్ రెహమాన్ సృష్టించి, ఆస్కార్ అవార్డ్ సాధించిన పాటకి పట్టిన గతి ఇదీ! 'స్లమ్ డాగ్ సినిమా విడుదలై ఎనిమిది ఆస్కార్ అవార్డులందుకున్నాక జయ హో పాట దాదాపు జాతీయగీతం అయిపోయింది. కాని కాంగ్రెస్ పార్టీ దానికి పేరడీగా తయారుచేసి పదే పదే వినిపిస్తున్న పాట మాత్రం ఒరిజినల్ పాటను ఎగతాళి పట్టిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు నాకు ఒరిజినల్ పాట కూడా వినాలనిపించడం లేదు' అని చెప్పింది ముప్ఫయ్యేళ్ల గురుగాఁవ్ కాల్ సెంటర్ హ్యూమన్ రిసోర్సెస్ విభాగం సీనియర్ మేనేజర్ మీతూ సింగ్. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార గీతం ఆమెకు కర్ణకఠోరంగా ఉందట!
ఈ మాటలు విని ఆమెను వెలి వేసే కాంగ్రెస్ విధేయులు, మీతూ ఒక్కర్తే అలా మాట్లాడడం లేదన్న విషయాన్ని విశ్లేషించుకోవాలి. పార్టీ విజయాలకు బాకా ఊదుతూ, ఆకాశానికి ఎత్తేస్తూ వినిపిస్తున్న ఈ సరికొత్త సంగీతం, రెహమాన్ బాణీ కట్టిన ఒరిజినల్ పాట సారాంశాన్ని నేలబారు చేసిందని యువ ప్రొఫెషనల్స్ అనేకమంది వ్యాఖ్యానిస్తున్నారు. 'జయహో పాటను మానవ విజయానికి, ఆశలకు, ఆఖరికి దేశభక్తికి ప్రతిరూపంగా అనేకమంది భావిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ విజయానికి మాత్రం కాదు. కేవలం తన విజయాలను టాంటాం వేసుకోడానికే దానిని కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది. ఆ పాట హక్కుల కొనుగోలుకు 2,00,000 అమెరికన్ డాలర్లను చెల్లించారట! దానికి బదులు, ఆ డబ్బును రెహమాన్ కే ఇచ్చి వేరే పాట కంపోజ్ చేయించుకుంటే బాగుండేది' ఢిల్లీకి చెందిన బజ్ ట్రావెల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీడియా మేనేజర్ శ్రద్ధా దాస్ మాటలివి!
Pages: 1 -2- News Posted: 18 March, 2009
|