న్యూఢిల్లీ: బిజెపిపై మళ్ళీ పట్టు సాధించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది. సంస్థను ప్రక్షాళన చేసే ప్రక్రియగా ఆర్ఎస్ఎస్ దీనిని పేర్కొంటున్నది. సంస్థాగతమైన పాలనా యంత్రాంగాన్ని తిరిగి తమ అదుపులోకి సంఘ్ లోని పూర్తి కాలపు పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారు క్రమంగా తీసుకోగలరు. ఇది జన సంఘ్ కాలంలో కొనసాగిన పద్ధతే. కాని బిజెపి వృద్ధితో ఇది క్రమంగా అంతరించింది.
'సంస్థాగత నాయకత్వానిదే పైచేయి కావాలి. పార్లమెంటరీ నాయకత్వంపై దాని మాటే నెగ్గాలి' అని ఆర్ఎస్ఎస్ వెటరన్ సైద్ధాంతికుడు ఎంజి అలియాస్ బాబూరావు వైద్య ఇటీవల అభిప్రాయం వెలిబుచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్) తరహాలో సంఘ్ తన విధానం కూడా సాగాలని అనుకుంటున్నది. సిపిఎంలో పొలిట్ బ్యూరోదే సర్వం సహాధిపత్యం.
1990 దశకం మధ్య భాగంలో అటల్ బిహారి వాజపేయి ప్రధాని పదవిని చేపట్టడంతో బిజెపిపై సంస్థాగతమైన ఆధిపత్యాన్ని ఆర్ఎస్ఎస్ కోల్పోయింది. కాని పాత నాయకత్వం తప్పుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వడంతో ఆర్ఎస్ఎస్ తిరిగి తన ఆధిపత్యం వహించబోతున్నది. ఆర్ఎస్ఎస్ ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు నాగపూర్ లో కీలకమైన ప్రతినిధి సభ (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) నిర్వహిస్తున్నది.