సీట్లపై కూటమిలో ఫీట్లు!
హైదరాబాద్ : రానున్న ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తున్న కొద్దీ మహా కూటమి (జిఎ)లోని భాగస్వామి పక్షాల మధ్య సీట్ల పంపకంపై విభేదాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. తెలుగు దేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), సిపిఎం, సిపిఐ పార్టీలలో ఏదీ తమ అభ్యర్థుల పేర్లను గాని, తాము పోటీ చేసే సీట్లను గాని ప్రకటించకపోవడంతో అన్ని పార్టీలలోని ఆశావహులు తమ రాజకీయ భవితవ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ నాయకలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి, నినాదాలు చేసిన తరువాత అలా నిరసన ప్రకటించడం వరంగల్ జిల్లా టెడిపి నాయకులు, కార్యకర్తల వంతు అయింది. వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానానికి టిక్కెట్ కోసం పోటీలే ఉన్న మాజీ ఎంఎల్ఎ జి. సుధారాణి సారథ్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అనేక మంది పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ధర్నా నిర్వహించారు. వరంగల్ తూర్పు సీటును సిపిఎంకు కేటాయించినట్లు వార్త వెలువడడంతో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆ ప్రతిపాదనకు ఆక్షేపణ తెలియజేశారు.
ఒక వైపు ఇలా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ మరొక వైపు సీట్ల పంపకంపై నాలుగు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలు తమ అభ్యర్థుల మొదటి జాబితాను ఈ నెల 23 లోగా విడుదల చేయగలవని ఆశించారు. కాని మహా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాల కారణంగా అభ్యర్థుల జాబితాల విడుదల వాయిదా పడవచ్చు. తాము ఈ నెల 27న జాబితాను విడుదల చేయగలమని టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె.టి. రామారావు సూచించారు. మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 28న ముగుస్తుంది.
Pages: 1 -2- News Posted: 21 March, 2009
|