'సైకిలె'క్కుతున్న అలకలు
హైదరాబాద్: మహాకూటమి అభ్యర్ధుల జాబితాను ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, కూటమిలో సీట్ల పంపకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం శ్రేణులు ధర్నాలు, అలకలు, బెదిరింపులకు దిగుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ తెలంగాణా జిల్లాల్లో టిఆరెస్ కు సీట్ల కేటాయింపును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ లో ధర్నా జరిపారు. భవనం హాలులో బైఠాయించి
టిఆరెస్ కు సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. షాద్ నగర్ లో తెలుగుదేశంకు 60 మంది ఎంపిటిసి లు ఉండగా, టిఆరెస్ కు కేవలం నలుగురు ఎంపిటిలు మాత్రమే ఉన్నారని, అటువంటప్పుడు టిఆరెస్ కు సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ లో ఎర్రన్నాయుడు కనిపిస్తే ఆయనతో వాగ్వివాదానికి దిగారు.
ఆయన నచ్చచెప్పినప్పటికీ, వినకుండా హాలులో నినాదాలు చేశారు. షాద్ నగర్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ఎంపి రావుల చంద్రశేఖరరెడ్డి వాళ్లకు నచ్చచెప్పారు. నినాదాలు చేస్తున్న కార్యకర్తలను కొందరు వారించగా, నిండా మునిగాం, ఇంతకంటె మించిపోయేదేముంది అని మళ్లీ నినాదాలు చేశారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నాం, ఇప్పటివరకు రిజర్వుడు నియోజకవర్గం అయిన షాద్ నగర్ ఇప్పుడు జనరల్ కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకుని పార్టీకోసం కష్టపడ్డామని, ఇప్పుడు పొత్తుల పేరుతో ఎలాంటి బలం లేని టిఆరెస్ కు సీట్లు కేటాయిస్తున్నారని, టిఆరెస్ కు సీటు కేటాయిస్తే కాంగ్రెస్ గెలుపు ఖాయం అని నాయకులు విమర్సించారు.
Pages: 1 -2- News Posted: 22 March, 2009
|