ఎన్టీఆర్ vs లోకేష్!
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఆధిపత్యం కోసం పోరు ప్రారంభమైన సూచనలు గోచరిస్తున్నాయి. ఒక వైపు జూనియర్ ఎన్టీఆర్ విజయవంతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తూ సైకిల్ తొక్కడం, పొలాలలో నిద్రించడం వంటి పనులతో అందరినీ ఆకర్షిస్తుండగా మరొక వైపు లోకేష్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారసునిగా తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. టిడిపి చేపట్టిన 'నగదు బదలీ పథకం' రూపకల్పనలో తన తండ్రికి తోడ్పడిన లోకేష్ ఇప్పుడు పార్టీ దైనందిన వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు.
టిడిపి వర్గాల సమాచారం ప్రకారం, సర్వేల ఆధారంగా వివిధ నియోజకవర్గాలలో విజయావకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడంలో లోకేష్ తన తండ్రికి సాయం చేస్తున్నారు. 'రాష్ట్రం అంతటా అభ్యర్థులను గుర్తించడం కోసం చంద్రబాబు నాయుడు ఎనిమిది సర్వేలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన తన కుమారుని సాయంతో అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్నారు' అని టిడిపి అధ్యక్షుని సన్నిహిత అనుచరుడు ఒకరు చెప్పారు.
ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నట్లుగా టిడిపి అధ్యక్షుడు పార్టీ పనిని నిర్వర్తించేందుకు తన కుమారుని కోసం తన ఇంటి సెల్లార్ లో ఒక ప్రత్యేక చాంబర్ ను ఏర్పాటు చేశారు. టిడిపిలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంలో చంద్రబాబు నాయుడుకు సాయం చేయవలసి ఉన్న కాంట్రాక్టర్ సి.ఎం. రమేష్, పారిశ్రామికవేత్త 'సుజన' చౌదరి, పార్టీ నాయకుడు గరికపాటి మోహనరావు వంటి ఆంతరంగికులు ఇప్పుడు లోకేష్ ను ఆయన చాంబర్ లో రోజూ కలుసుకుంటూ, పార్టీ వ్యవహారాల గురించి చర్చిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 23 March, 2009
|