కూటమికి సెటిలర్ల సెగ!
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి చాలా కాలం క్రితమే వచ్చి తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన వారి వ్యవహారం తెలుగు దేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలను ఎక్కువగా కలవరానికి గురి చేస్తోంది. సెట్లర్లు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలను టిఆర్ఎస్ కు కేటాయించవద్దని టిడిపి కార్యకర్తలు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా టిడిపి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పార్టీలో ఏమాత్రం వ్యతిరేకత వ్యక్తం కాలేదు. చివరకు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా ప్రకటించినప్పుడు కూడా పార్టీలో వ్యతిరేకత కానరాలేదు. అయితే, సెట్లర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను టిఆర్ఎస్ కు కేటాయిస్తే మాత్రం సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.
కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో టిడిపియే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందని, సెట్లర్ల హక్కులు తాము కాపాడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల టిఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టిడిపిలో విస్తృతంగా చర్చ జరిగిన తరువాతే వారు తెలంగాణకు అంగీకరించారని, టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని, అటువంటిది ఇప్పుడు సెట్లర్ల హక్కులను కాపాడతామని చంద్రబాబు చెబుతున్నారంటే తెలంగాణ వారి నుంచి సెట్లర్లకు ప్రమాదం ఉందే అభిప్రాయం కలుగుతుందని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సెట్లర్లు ఉన్న చోట్ల తామే పోటీ చేస్తామని టిడిపి ప్రకటిస్తే తెలంగాణవాదులు ఆ పార్టీకి ఎలా మద్దతు పలుకుతారని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
Pages: 1 -2- News Posted: 27 March, 2009
|