దేశం ఆఫీసులో హై డ్రామా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో హై డ్రామా జరిగింది. విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ పాల్గొనవలసి ఉండగా, ఆయన స్థానంలో పోలిట్ బ్యూరో సభ్యుడు ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొనడం ఆశ్చర్యం కలిగించింది. చంద్రశేఖర్ విలేఖరుల సమావేశంలో పాల్గొంటారని మీడియాకు ముందుగా సమచారం అందించారు. ఆయన 12.30 గంటలకే ఎన్టీఆర్ భవన్ చేరుకున్నారు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటినుంచి ఫోన్ రావడంతో వెంటనే వెళ్లిపోయారు. మహబూబ్ నగర్ శాసన సభ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు బి ఫారం తీసుకుని మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మహబూబ్ నగర్ చేరుకున్నారు. చంద్రశేఖర్ చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో విలేఖరులు అశ్చర్యపోయారు.
ఈ లోగా చంద్రబాబు ఇంటివద్ద ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ భవన్ కు వచ్చితానే విలేఖరుల సమావేశంలో మాట్లాడుతానని ప్రకటించారు. చంద్రశేఖర్ చెప్పాలనుకున్న విషయాన్ని పక్కనబెట్టి కేవలం మహాకూటమి సీట్ల సర్దుబాటు తర్వాత తెలుగుదేశం అభ్యర్దులురెబెల్ గా పోటీచేస్తున్నారన్న విషయంపై అయన వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధులు నామినేషన్లు వేశారన్న వార్త వెలువడడంతో ఎన్టీఆర్ భవన్ లోని ఆ పార్టీ నాయకులు, కార్యక్తలు ఆనందంలో మునిగిపోయారు. తెలుగుదేశానికి బలమైన సీట్లను టిఆరెస్ బలవంతంగా లాక్కుందని, బి ఫారాలు ఇచ్చి నామినేషన్లు వేయించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదేనని మద్దతు పలికారు. మధ్యాహ్నం ఒంటి గంట నుచి సాయంత్రం వరకు ఈ అంశంపై వారంతా చర్చించుకుంటూ పార్టీ కార్యాలయంలోనే కూర్చున్నారు.
Pages: 1 -2- News Posted: 31 March, 2009
|