పీటర్ కు పిఆర్పీ సీటా!
హైదరాబాద్: పసిపిల్లల అక్రమ వ్యాపారిగా ఆరోపణలెదుర్కొంటున్న పీటర్ సుబ్బయ్యకు ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుబ్బయ్యకు చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటయించడంపై పునరాలోచించాలని ప్రజారాజ్యం సీనియర్ నాయకులు అగ్రనాయకత్వానికి సూచిస్తున్నారు. సుబ్బయ్యపై వచ్చిన ఆరోపణలు సామాన్యమైనవి కావని, అతడికి టిక్కెట్ ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీటర్ సుబ్బయ్య రాజకీయవేత్తగా కాకుండా పసిపిల్లల అక్రమ వ్యాపారం కేసులో బాగా ప్రచారం పొందినట్టు ప్రజారాజ్యం నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో గిరిజన పిల్లల అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. స్వచ్ఛందసంస్థల ముసుగులో కొంతమంది గిరిజన తండాలకు చెందిన పసిపిల్లలను విక్రయించారు.
ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, పీటర్ సుబ్బయ్య నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రమేయం కూడా ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడయింది. లభ్యమైన ఆధారాలతో ఆ తరువాత కేసు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసు మాజీ ప్రధానాధికారి భార్య జోక్యం కూడా ఉన్నట్టు బయటపడింది. ఈ కారణంగానే పీటర్ సుబ్బయ్య తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. అప్పటినుండి రాజకీయాలకు దాదాపు దూరంగా వున్న సుబ్బయ్య ఉన్నట్టుండి ప్రజారాజ్యం పార్టీలో చేరి, సత్యవేడు సీటుకు పార్టీ టిక్కెట్ పొందారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైనందు వల్లనే ఆయనకు సత్యవేడు టిక్కెట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా, రాయలసీమకు చెందిన ఓ ప్రముఖ నాయకుడి సిఫార్సు మేరకే సుబ్బయ్యకు సీటు ఇచ్చారని మెజారిటీ సభ్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 1 April, 2009
|