వైఎస్ కు డిఎస్ దూరం?
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఎవరి దారి వారిదే అన్నట్టు పర్యటనలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తరఫున తెలంగాణలో ప్రచారం జరుపుతున్న ముక్యమంత్రి పిసిసి అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్ లో పర్యటిస్తుండగా శ్రీనివాస్ అక్కడినుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.ఇప్పటికే అభ్యర్ధుల ెంపికలో వైఎస్ హవాయే కొనసాగిందన్న ప్రచారం జరుగుతుండగా, వైఎస్ కు డిఎస్ దూరంగా ఉండడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాలో వైఎస్ ప్రచారానికి వెళ్తున్నారన్న విషయం ముందే తెలిసినా, అంతకు ముందే ఆయన హైదరాబాద్ చేరుకోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ తన సొంత జిల్లాలో ఆకుల లలిత మినహా మరెవరికీ టిక్కెట్లు ఇప్పించుకోలేకపోయారని, నిజామాబాద్ జిల్లాలోనూ వైఎస్ తన ముఖ్య అనుచరులకు టిక్కెట్లు దక్కించుకున్నారని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.
మరోవైపు డి.శ్రీనివాస్ హైదరాబాద్ లోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ బి-ఫారాలు ఇవ్వడానికే తాను నగరానికి వచ్చానని చెప్పారు. అంతే కాకుండా పార్టీకి సంబంధించి ముఖ్యమైన పనులు ఉన్నాయని ఆయన తెలిపారు. తాను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిననీ, ఒక్క జిల్లాకే తనను పరిమితం చేయరాదనీ, వైఎస్ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తుండగా తానక్కడ లేరపోవడం వల్ల తప్పుడు సంకేతాలేవీ పోవని ఆయన వివరణ ఇచ్చారు. తనకు ముఖ్యమంత్రితో ఎటువంటి అభిప్రాయభేదాలు లేవన్నారు. మహాకూటమి గొడవలతో తనకు సంబంధం లేదని, అవి ఆయా పార్టీల వ్యక్తిగత వ్యవహారాలని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.
Pages: 1 -2- News Posted: 2 April, 2009
|