హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో ప్రత్యక్ష పోరును మించి కుట్రలు, కుతంత్రాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఓటర్లను అయోమయంలో పడేసి గందరగోళం సృష్టించడానికి ప్రత్యర్ధులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. పోటీలో వున్న ప్రధాన అభ్యర్ధులను దొంగ దెబ్బతీయడానికి అనైతిక పథకాలు రచిస్తున్నారు. బలమైన అభ్యర్ధుల పేర్లే దాదాపుగా గల వ్యక్తులను ఎంచుకుని వారిచేత నామినేషన్లు వేయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కుట్రకు ప్రధానంగా ప్రజారాజ్యం అభ్యర్ధులే బలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అనేక నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్ధుల పేర్లకు దగ్గరగా పేర్లు వున్న వారి ఎంపిక జోరుగా సాగుతోంది. వారిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టడం ద్వారా ప్రముఖులైన అభ్యర్ధుల ఓట్లు చీల్చేందుకు దాదాపు అన్ని చోట్ల ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
అదేవిధంగా ప్రత్యర్ధుల గుర్తులకు దాదాపు సమానంగా ఉండే మరో గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించే విధంగా అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ రకంగా ఓటర్లను మభ్యపెట్టి ప్రధాన అభ్యర్ధుల ఓట్లను చీల్చాలనేది వారి ఎత్తుగడ! తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇలాంటి ప్రయత్నాలు జోరందుకున్నట్టు తెలిసింది. అక్కడ వరుసగా ఆరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ పేరును పోలి వున్న మాతా గోపాలకృష్ణ అనే వ్యక్తిచేత నామినేషన్ వేయించారు. ఈ ఎత్తుగడతో ముత్తాకు పడవలసిన ఓట్లను చీల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ముత్తాకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా భావించేవారిని కూడా తికమకపెట్టాలన్నది వారి ఆలోచన.