మహాకూటమిలో గందరగోళం!
హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమర్ధవంతంగా ఎదుర్కోడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన మహాకూటమి ఆయనను ఒంటరి చేసినట్టు కనిపిస్తోంది. గత వందరోజులుగా సాగిన సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని ఎన్నో అభ్యంతరాలు, అసంతృప్తుల మధ్య బలవంతంగా ముగించినట్టు తెలిసింది. రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల సమరానికి తుది గడువుకూడా తీరిపోవడంతో ఇక ప్రత్యక్ష యుద్ధమే మిగిలింది. మహాకూటమి భాగస్వామ్య పక్షాలు తన పార్టీ శ్రేణులను సంతృప్తి పరచడంలో ఘోరంగా విఫలమయిందని తెలిసింది. ఫలితంగా భాగస్వామ్య పక్షాలకు చెందిన కార్యకర్తలు తమకు అనుకూలమైన నిర్ణయాలు జరగలేదని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలిసింది. ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కుదిరిన అవగాహనపై పార్టీ శ్రేణులు ఏ మేరకు విశ్వాసం ఉంచుతారనేది సందేహాస్పదమని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఉద్దేశానికి తూట్లు పొడిచే విధంగా ఆయన సొంత పార్టీలోని నాయకులు టిఆరెస్ కు అధికారికంగా కేటాయించిన స్థానాల్లో ఆరు అసెంబ్లీ, రెండు పార్లమెంటరీ స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీలో ఉన్నారు.
అంతే కాకుండా, ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు భాగస్వామ్య పక్షాలతో సర్దుకుపోవాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ే మేరకు సత్ఫలితాలు ఇస్తోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం అసంతృప్తి నాయకుల వ్యవహారం చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లేదిగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు సిపిఎంకు చెందిన అభ్యర్ధులు వారికి కేటాయించిన స్థానాలకు మించి రంగంలో ఉండడం తెలుగుదేశం పార్టీ వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సిపిఎంకు 13 స్థానాలు కేటాయించగా, ఆ పార్టీ మరో 8 మంది అభ్యర్ధులను తెలుగుదేశం అభ్యర్ధులు పోటీలో ఉన్న స్థానాల్లో , నామినేషన్ల గడువు ముగిసే నాటికి వారి అభ్యర్ధిత్వాన్ని ఉపసంహరించుకోకపోవడం భాగస్వామ్య పార్టీలకు మింగుడు పడడం లేదు.
Pages: 1 -2- News Posted: 4 April, 2009
|