రైలింజన్ కు రెబెల్స్ పొగ
కాకినాడ నామినేషన్ల గడువుకు కొద్ది గంటలముందు అభ్యర్ధులను ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ తూర్పు గోదావరి జిల్లాలో అనేక రకాల సమస్యలను ఎదుర్కుంటోంది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులు ఎంపిక కావడం విశేషం. మొత్తం 19 సీట్లలో రెండు మహిళలకు దక్కాయి. యువజనం రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ, తెలుగుదేశం నుంచి వలస వచ్చినవారికే టిక్కెట్లు దక్కాయి. కొత్త అభ్యర్దులకు సీట్లు వచ్చినా అవి కేవలం చిరంజీవి కార్యాలయ సిబ్బందికే పరిమితమయ్యాయి. జిల్లాతో సంబంధం లేని వారికి ఈ జిల్లాలో టిక్కెట్లివ్వడం వివాదాస్పదంగా మారింది. సామాజిక వర్గాల పేరిట ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తులకు చివరి నిముషంలో టిక్కెట్లిచ్చారు. పార్టీ కార్యాలయంలో సేవలందిస్తున్నారనిన ఒకే ఒక కారణంతో కాకినాడ రూరల్ ను కన్నబాబుకు, రాజానగరంను ముత్యాల శ్రీనివాస్ కు, రాజమండ్రి రూరల్ ను రవణం స్వామినాయుడుకు, గన్నవరంనుం జంగా గౌతమ్ కు, ఆయన బంధువైన కారణంగా రాజోలు స్థానాన్ని మల్లిక్ కు కట్టబెట్టారు.
తెలుగుదేశంలో చివరి వరకు టిక్కెట్ కోసం ప్రయత్నించి ప్రజారాజ్యంలో చేరిన శీతంశెట్టి వెంకటేశ్వరరావుకు రంపచోడవరం సీటిచ్చారు. అదే పార్టీ నుంచి వలస వచ్చిన తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, తోట నవీన్, వంగా గీత, పంతం గాంధీమోహన్, బండారు సత్యానందరావు, కుడుపూడి సూర్యనారాయణరావు సీట్లు దక్కించుకోగలిగారు. అమలాపురంలో పట్టున్న నాయకుడు మెట్ల సత్యనారాయణ సూచించిన నెల్లి కిరణ్ కుమార్ కు సీటు దక్కలేదు. అమలాపురం స్థానాన్ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సిఫార్సు మేరకు చింతా కృష్ణమూర్తికి కేటాయించారు. ఆయన అల్లుడు ఇన్ కం టాక్స్ కమిషనర్ గా పని చేస్తున్నందువల్ల కృష్ణమూర్తిని రజనీకాంత్ సిఫార్సు చేసినట్టు తెలిసింది.
Pages: 1 -2- News Posted: 6 April, 2009
|