మన ఇవిఎంలకు గిరాకి
న్యూఢిల్లీ : భూటాన్ క్రితం సంవత్సరం తన ఎన్నికలలో వాటిని ఉపయోగించింది. నేపాల్ కూడా వాటిని సమీకరించింది. మన దేశంలో తయారైన ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రం (ఇవిఎం)లు మన పొరుగు దేశాలలోనే కాకుండా ఆఫ్రికా ఖండంలో కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. వోటింగ్ యంత్రాల కోసం నమీబియా ప్రభుత్వం ఆర్డర్లు పంపింది. మన పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ లతో పాటు ఘనా, దక్షిణాఫ్రికా, నైజీరియా కూడా ఇవిఎంల పట్ల ఆసక్తి ప్రదర్శించాయి.
ఎన్నికల కమిషన్ (ఇసి) కోసం ఇవిఎంలను ఉత్పత్తి చేస్తున్న రెండు ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్ - బెల్) జనరల్ మేనేజర్ అమోల్ నెవాస్కర్ 'ఐఎఎన్ఎస్' విలేఖరితో మాట్లాడుతూ, దాదాపు ఒక నెల క్రితం తాము నేపాల్ కు 470 ఇవిఎంలను సరఫరా చేసినట్లు వెల్లడించారు. 'ఇటీవలే మేము విదేశాంగ మంత్రిత్వశాఖ ద్వారా నేపాల్ కు ఇవిఎంలను సరఫరా చేశాం. ప్రస్తుతం నమీబియాతో చర్చలు సాగుతున్నాయి. కాంట్రాక్ట్ పై కూడా సంతకాలు జరిగాయి. వారికి 2000 ఇవిఎంలు కావలసి ఉంటుంది. అయితే, ఉత్పత్తిని ఇంకా ప్రారంభించలేదు' అని ఆయన తెలిపారు. మలేసియా కూడా ఈ యంత్రాలు కొనుగోలు చేయాలనే ఆసక్తితో ఉన్నదని నెవాస్కర్ తెలిపారు.
బెల్ సంస్థ ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా ఇవిఎంలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ 2007 నుంచి వాటి బ్యాచ్ లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. 'ఇన్ బిల్ట్ క్లాక్'లు వంటి అదనపు సౌకర్యాలను వాటిలో పొందుపరిచింది. దీని వల్ల ఇవిఎం మరింత బాగా ఉపయోగపడుతుంది. 'కొత్త ఇవిఎంలు బ్యాలట్ ను మాత్రమే కాకుండా మీరు వోటు వేసిన సమయాన్ని కూడా నమోదు చేస్తుంది. గంట గంటకు ఎన్ని వోట్లు పోలైందీ ఇది వెల్లడి చేయగలదు. అందువల్ల ఎవరైనా తన వోటును తారుమారు చేశారని ఫిర్యాదు చేసినప్పటికీ వారు తమ వోటు వేసిన సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వోటు ప్రక్రియను లోపరహితంగా చేయడానికి ఇది దోహదం చేస్తుంది' అని నెవాస్కర్ పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 6 April, 2009
|