తళతళ మెరవని తారలు
హైదరాబాద్ : చిరంజీవి రాష్ట్ర రాజకీయాలలో తారా బలాన్ని పెంచి ఉండవచ్చు. కాని ఎవరో కొద్ది మంది తప్పిస్తే ఈ ఎన్నికలలో మిలమిల మెరవని తారలే టాలీవుడ్ ఉన్నారు. రాజకీయ తారాపథానికి ఎగరాలని ఆశించిన సినీ ప్రముఖులలో విజయశాంతి, రోజా, జయసుధ, మురళీమోహన్, కృష్ణంరాజు మినహా మిగిలినవారిని టిక్కెట్ల కేటాయింపు విషయంలో పట్టించుకోలేదు. రాజకీయ నాయకులు వారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ తారల గ్లామర్ ను అంతగా పరిగణనలోకి తీసుకోలేదు. టిక్కెట్ల విషయంలో అసంతృప్తికి గురైన తారలలో జీవిత, శ్రీహరి, శారద, సత్యనారాయణ, కృష్ణ, విజయచందర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా గొంతు చించుకుని ప్రచారం చేసినప్పటికీ జీవితను కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం తేలికగా పక్కకు నెట్టేసింది. ఇక వెటరన్ నటుడు కృష్ణ తన సోదరుడు ఆదిశేషగిరిరావుకు గుంటూరు లోక్ సభ స్థానానికి టిక్కెట్ కోసం ఎంతగానో ప్రయత్నించి విఫలం చెందారు.
'కరుణామయుడు' చిత్రంలో ఏసు క్రీస్తుగా అందరినీ మెప్పించిన విజయచందర్ సినీ ప్రపంచానికి, వాస్తవ ప్రపంచానికి మధ్య గల అంతరాన్ని గ్రహించారు. 'ఆయన కాకినాడ లోక్ సభ సీటుపై ఆశ పెట్టుకున్నారు. కాని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం రెండు ప్రధాన లోక్ సభ స్థానాలలో (రాజమండ్రి లోక్ సభ స్థానానికి ఉండవల్లి అరుణకుమార్ అభ్యర్థి) ఇద్దరు బ్రాహ్మణులను నిలబెట్టేందుకు ధైర్యం చేయలేకపోయింది' అని పార్టీ పరిశీలకుడు ఒకరు పేర్కొన్నారు. 'ఏంగ్రీ హీరో', కాపు అయిన శ్రీహరిని కృష్ణా జిల్లా పెడన అసెంబ్లీ స్థానానికి నిలబెట్టాలని కాంగ్రెస్ ఆలోచించింది కాని ఆయన తన మిత్రుడు వంగవీటి శంతను అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించడంతో పరిస్థితి మారిపోయింది. 'హైదరాబాద్ కూకట్ పల్లిలో ఆంధ్ర ప్రాంతం నుంచి స్థిరపడిన వారి సంఖ్య అధికంగా ఉన్నందున అక్కడ శ్రీహరిని నిలబెట్టవచ్చునని ఊహాగానాలు సాగాయి. చివరకు అదీ నిజం కాదని తేలిపోయింది' అని పరిశ్రమ విశ్లేషకుడు ఒకరు పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 7 April, 2009
|