లగడపాటి సంపన్న అభ్యర్థి
విజయవాడ : విజయవాడ లోక్ సభ నియోజకవర్గం వాసులు ఒక విషయం గురించి 'గొప్పగా' చెప్పుకోవచ్చు. తమ లోక్ సభ ప్రతినిధి, రానున్న ఎన్నికలలో తిరిగి పోటీ చేస్తున్న లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన ఆస్తులను బట్టి చూస్తే దేశంలోని అభ్యర్థులందరిలోకి అత్యంత సంపన్నుడని విదితం అవుతోంది. అభ్యర్థులు ఎన్నికల కమిషన్ (ఇసి)కి అందజేసిన సమాచారం ప్రకారం, లగడపాటి రూ. 299 కోట్ల మేరకు ఆస్తులు, నగదు కలిగి ఉండి అత్యంత సంపన్న అభ్యర్థులలో అగ్ర స్థానాన్ని ఆక్రమించారు. ఈ జాబితాలో ఆయనకు దరిదాపులలోకి వచ్చే అభ్యర్థి ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి మాత్రమే. చిరంజీవి ఆస్తుల విలువ రూ. 88 కోట్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రూ. 77 కోట్లు విలువ చేసే ఆస్తులతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ (టిడిపి) కేడర్ లు ఏమీ బాధపడనవసరం లేదు. వారి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ. 68.70 కోట్లు విలువ చేసే ఆస్తులతో ఆతరువాతి స్థానంలో ఉన్నారు.
'ఇవన్నీ రికార్డులలో మాత్రమే ఉన్న ఆస్తులు. ఇసికి వారు చూపించిన వాటికి మించే వారికి ఆస్తులు ఉండి ఉండవచ్చు' అని రిటర్నింగ్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చట్టాలను, పన్నులను తప్పించుకోవడానికి ఆస్తులలో మూడింట ఒక వంతును మాత్రమే తమ పేరును చూపించి మిగిలిన ఆస్తులను బినామీ పేర్లలో ఉంచడం అభ్యర్థులకు పరిపాటి అని విశ్లేషకులు పేర్కొన్నారు. లగడపాటి రాజగోపాల్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ఆయనకు రూ. 90.45,43,881 విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. ఆయన స్థిరాస్తుల విలువ రూ. 14,05,77,335. ఇంకా ఆయన వద్ద 3,61,600 డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 180,72,80,000) ఉన్నాయి. ఆయన భార్య పద్మకు రూ. 14,16,98,903 విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్నాయి. మొత్తంగా భార్యా, భర్తలకు గల ఆస్తుల విలువ రూ. 299,40,99,209. వాటిలో రాజగోపాల్ వద్ద రూ. 6,57,694 మేరకు నగదు నిల్వలు, రూ. 82,82,76,375 విలువ చేసే బాండ్లు, డిబెంచర్లు ఉన్నాయి. ఆయన ఎల్ఐసి పాలిసీలలో రూ. 2,00,00,368 మదుపు చేశారు. ఆయన వద్ద రూ. 1,07,31,300 విలువ చేసే 7202 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆయనకు రూ. 70,24,600 విలువ చేసే వ్యవసాయ భూమి, రూ. 13,35,52,735 విలువ చేసే ఇళ్ళు, అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఆయన వివిధ బ్యాంకుల నుంచి రూ. 5,91,34,867 మేరకు రుణాలుతీసుకున్నారు. రాజగోపాల్ లాంకో గ్రూపును స్థాపించారు. కాని ఇప్పుడు ఆయన సంస్థ వ్యవహారాలు చూడడం లేదు.
Pages: 1 -2- News Posted: 7 April, 2009
|