కొంప ముంచే సోదర ప్రేమ!
హైదరాబాద్ : సోదర ప్రేమ శ్రుతి మించి రాగాన పడిన కేసు ఇది. తమ సోదరులు లోపాయికారీగా, అవినీతి పనులు సాగిస్తూ, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు మంత్రులు రానున్న ఎన్నికలలో వోటర్ల ఆగ్రహానికి గురి కావచ్చు.
మంత్రులైన తమ సోదరులు అపరిమిత అభిమానం చూపుతుండడంతో వారు యథేచ్ఛగా అవినీతి చర్యలకు పాల్పడుతూ, కోట్లాది రూపాయలు విలువ చేసే కాంట్రాక్టులు, సివిక్ పనులు చేపట్టుతూ, అధికార వర్గాలను తమ చెప్పు చేతలలో ఉంచుకుంటున్నారు. కొణతాల రామకృష్ణ, మహమ్మద్ అలీ షబ్బీర్, జె.సి. దివాకరరెడ్డి వంటి మంత్రులు తమ సోదరులు అంతు లేకుండా అక్రమార్జన చేస్తుంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు.
'తమ ఆదాయానికి మించిన ఆస్తులను వారు సంపాదించిన తీరు చూడవలసిందే. వారు ప్రజల డబ్బును కొల్లగొట్టారు' అని తెలుగు దేశం పార్టీ (టిడిపి) సీనియర్ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి ఆరోపించారు. కొణతాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు పనులను బాగా దగ్గర ఉండి గమనిస్తున్న ఒకరు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, 'సోదరులు రుబాబు చేసి పనులు జరిపించుకోవడం ఒక ఎత్తు. కాని అధికార గణం కూడా వారి పట్ల అణకువగా ఉండడం మరొక ఎత్తు' అని అన్నారు. 'పెదబాబు'గా అందరికీ తెలిసిన రఘుబాబు పెత్తనం అనకాపల్లిలో సాగుతుంటుంది. 'పెదబాబు ప్రధాన వ్యావృత్తి సెటిల్ మెంట్లు. భూ వివాదాలు లేదా బెల్లం వ్యాపార లావాదేవీలు లేదా మునిసిపల్ పనులు ఇలా ఏవైనా సరే ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. అధికారులు కూడా వారి అడుగులకు మడుగులు ఒత్తుతుండడం వల్ల ఆయనను నిలదీసే ధైర్యం ఎవరికీ లేదు. ఏదో చిన్న స్థాయి కాంగ్రెస్ నాయకుడు, ఉల్లిపాయలు, బెల్లం వ్యాపారం చేస్తుండే మనిషే అయినప్పటికీ పెదబాబు తరచు అధికార కార్యక్రమాలలో కనిపిస్తుంటారు' అని మరొక ప్రతినిధి పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 8 April, 2009
|