రైలింజన్ లో అసమ్మతి పొగ!
హైదరాబాద్: రైలిజన్ లో అసమ్మతి భారం పెరుగుతోంది. నిరసన కూతలు ఎక్కువైపోతున్నాయి. నడిపించే పట్టాలే దారి తప్పుతున్నాయి. ఇద్ పరిస్థితి కొనసాగితే పేదవాడికి పొగబండి కనుమరుగు కాక తప్పదు. అసమ్మతి జ్వాల ఉధృతమవుతూ ఒకప్పుడు వెన్నంటి వున్నవారే ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఆంజనేయ రెడ్డి, పరకాల ప్రభాకర్, బొమ్మన రాజ్ కుమార్, సమరం, మసాల ఈరన్న ... ఒకరూ ఇద్దరూ కాదు, దాదాపు రోజుకో ప్రముఖుడు గుడ్ బై చెప్పేస్తున్నారు. సామజిక న్యాయం నినాదంతో ఒకప్పుడు ప్రకంపనలు సృష్టించిన ప్రజారాజ్యం ప్రత్యర్ధులకు గుబులు పుట్టించింది. మార్పు కసరత్తు వారికి హడలెత్తించింది. అయితే, ఇదెంతో కాలం నిలవలేదు. పదవుల పంపకం దుమారం లేపితే, టిక్కెట్ల పంపిణీ గందరగోళాన్ని, అసమ్మతి గళాన్ని రేకెత్తించింది.
ఇన్నాళ్లూ అల్లు అరవింద్ పేరో, మరో నాయకుడి పేరో చెప్పి చాలామంది పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోతే, తాజాగా పరకాల ప్రభాకర్ ఏకంగా పార్టీ అధినేతనే నిందించి కొత్త అధ్యాయానికి తెర తీశారు. చిరంజీవికి చిత్తశుద్ధి లేదన్నారు. రాజీనామా చేయడానికి పార్టీ ఆఫీసుకు వచ్చిన పరకాల, ఏకంగా అక్కడే విలేఖరుల సమావేశం పెట్టారు. అధినేత కుర్చీలోనే కూర్చుని ఆయన్నే ఏకి పారేశారు. విశేషం ఏమిటంటే ఇదేమి సంస్కృతి అంటూ అంతా అయిపోయాక నెత్తి మొత్తుకున్నారే తప్ప, పరకాల మాట్లాడుతుండగా అడ్డుకున్న నాయకుడు ఒక్కరు కూడా లేకపోయారు. ప్రజారాజ్యం ప్రధాన కార్యాలయం ఎలా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే!
Pages: 1 -2- News Posted: 10 April, 2009
|