కెసిఆర్ షో ఫ్లాప్!
ఆదిలాబాద్: వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు వాల్గొన్న బహిరంగ సభ వెలవెల పోయింది. గత ఎన్నికల్లో కెసిఆర్ వాగ్ధాటికి ఆకర్షితులైన ప్రజలు వేలాదిగా ఆయన సభలకు హాజరయ్యేవారు. కాని ఈసారి రాజకీయ సమీకరణలు, పొత్తులు మారడంతో ఆయన సభలు జనం రాక బోసిపోతున్నాయి. కనీసం తాను వచ్చేటప్పుడు రోడ్డుమీద కూడా ఎవరూ పలకరించకపోవడంతో ఆయన నివ్వెరపోయారు. సిర్పూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల సభల్లో పాల్గొనడానికి కెసిఆర్ హెలికాప్టర్ లో, రెండు గంటలు ఆలస్యంగా, రావడంతో జనసమీకరణకోసం కార్యకర్తలు నానా తంటాలు పడ్డారు.
టిఆరెస్ నాయకుడు తన ప్రసంగాలలో తెలంగాణ ఊసెత్తకుండా తెలుగుదేశం ప్రకటించిన కలర్ టివిలు, నగదు బదిలీ పథకం గురించి పదేపదే వల్లించడంతో జనం స్పందన కూడా అంతంత మాత్రంగా వుంది. దీంతో ఆయన ఇరవై నిముషాల్లోనే ప్రసంగాలు ముగించేసి వెళ్లిపోయారు. ఆ తరువాత రోడ్ షో కోసం బయలుదేరగా రెబ్బెన, తాండూర్, బెల్లంపల్లి, మందమర్రి పట్టణాల్లో మండుటెండ కారణంగా జనం రాలేదు. రెబ్బెన నుండి మంచిర్యాల వరకు 50 కిలోమీటర్లు పొడవునా రోడ్లు నిర్మానుష్యం కావడంతో కెసిఆర్ గత్యంతరం లేక ప్రచార రథంలోనే ఉండిపోయారు. ఈ సభలు రద్దు చేసుకుని కార్మిక క్షేచ్రమైన మంచిర్యాలలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్లగా, ఆహ్వానం అందని తెలుగుదేశం నాయకులు హాజరు కాలేదు.
Pages: 1 -2- News Posted: 12 April, 2009
|