'కూల్'గా ఓటు వేశారు
హైదరాబాద్ : మొదటి దశ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం అంతటా ఓట్లు వేయడానికి జనం మండే ఎండల్లో బారులు తీరగా 'అతి శీతల' మార్గంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నవారు కొందరు ఉన్నారు. కూకట్ పల్లి శాసనసభ నియోజకవర్గంలో మలేషియన్ టౌన్ షిప్, కెపిహెచ్ బి ఐదవ ఫేజ్ ప్రాంతాలలోని 2600 మంది ఓటర్లు రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎయిర్-కండిషన్డ్ పోలింగ్ కేంద్రంలో తమ వోట్లు వేశారు.
ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రం కోసం టౌన్ షిప్ ఆవరణలోని క్లబ్ హౌస్ ను కేటాయించింది. టౌన్ షిప్ సభ్యుల కోసం సమావేశాలు, వేడుకలకు సాధారణంగా ఉపయోగిస్తుండే ఎయిర్-కండిషన్డ్ క్లబ్ హౌస్ ఈ ప్రాంతం వాసులకు ఉపశమనం కలిగిస్తూ పోలింగ్ కేంద్రం అయింది.
ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయమేమంటే ఈ పోలింగ్ కేంద్రానికి అధిక సంఖ్యలో ఓటర్లు వచ్చారు. మధ్యాహ్నానికే 50 శాతం ఓటింగ్ నమోదైంది. పగటిపూట అంతా భారీ సంఖ్యలో ఓటర్లు రావడం చూసి పోలింగ్ అధికారులే ఆశ్చర్యపోయారు. తాము తమ కాలనీ ఎన్నికలను ఇదే ఎయిర్-కండిషన్డ్ క్లబ్ హౌస్ లో నిర్వహిస్తుంటామని కమిటీ సభ్యులు తెలియజేశారు. 'టౌన్ షిప్ లో 7000 మంది నివసిస్తున్నారు. వారిలో 942 మంది ఓటర్లు ఉన్నారు. వారే కాకుండా కెపిహెచ్ బి ఐదవ ఫేజ్ గృహాలలో దాదాపు 1600 మంది ఓటర్లు ఉన్నారు. అందువల్ల వారు మా క్లబ్ హౌస్ ను పోలింగ్ కేంద్రంగా కేటాయించారు. ఇంత భారీ ఎత్తున ఓటర్లు రావడం నాకే ఆశ్చర్యం కలిగించింది' అని టౌన్ షిప్ కార్యదర్శి పి. రెడ్డి చెప్పారు.
Pages: 1 -2- News Posted: 17 April, 2009
|