మద్యం, డబ్బుకు గ్రామం నో
నరసింగపల్లి (నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ మండలంలోని నరసింగపల్లి గ్రామంలో మద్యం, డబ్బు పంపిణీ చేయడానికి ఏ రాజకీయ నాయకుడూ ధైర్యం చేయలేదు. ఇందుకు అధికారుల భయం కారణం కాదు. గ్రామస్థుల దృఢ వైఖరే ఇందుకు కారణం.
ఇరుగు పొరుగు గ్రామాల వాసులు, రాజకీయ నాయకులు లోపాయికారీగా అందజేసిన కానుకలను 'ఎంజాయ్' చేయగా నరసింగపల్లి గ్రామస్థులు తమ వైఖరిని ససేమిరా మార్చుకోబోమన్నారు. అంతేకాదు, గ్రామంలో ఎటువంటి ప్రచారమూ చేయవద్దని, ఏ ఎన్నికల కార్యాలయాన్నీ ఏర్పాటు చేయవద్దని కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టిడిపి), ఇతర పార్టీలకు గ్రామస్థులు స్పష్టంగా సూచించారు.
అందుకు బదులుగా గ్రామస్థులు ఏప్రిల్ 9న రంగంలో ఉన్న అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. వెటరినరీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, భూగర్భ డ్రెయినేజి సౌకర్యం కల్పించాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటే చేస్తున్న అభ్యర్థులు మండవ వెంకటేశ్వరరావు (టిడిపి), ఆకుల లలిత (కాంగ్రెస్), డాక్టర్ ఇ. రవీందర్ రెడ్డి (ప్రజారాజ్యం పార్టీ), లీలా శివశ్రీ (బిజెపి), డాక్టర్ బానోత్ బిలోజి నాయక్ (లోక్ సత్తా) గ్రామస్థులు సిద్ధం చేసిన హామీల బాండ్ పేపర్ పై సంతకాలు చేయడం గమనార్హం. తమ గోడలపై పోస్టర్లు అంటించకుండా, రోడ్లపై బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేయకుండా గ్రామస్థులు జాగ్రత్త వహించారు.
Pages: 1 -2- News Posted: 17 April, 2009
|