నక్సల్స్ సంయమనం
హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు దశాబ్దాల నక్సలైట్ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. మావోయిస్టులు మొట్టమొదటిసారిగా గురువారం పోలింగ్ మొదటి దశలో హింసాకాండకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు.
అయితే, ఈ రికార్డు రెండవ దశ పోలింగ్ రోజు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుందనే ఆశతో పోలీస్ అధికారులు ఉన్నారు. 1985 మధ్యంతర ఎన్నికల సమయం నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలలోను తీవ్రవాదుల దౌర్జన్య సంఘటనలు లేకుండా జరగలేదు. నక్సల్స్ 1985 నుంచి ప్రతి ఎన్నికలను లక్ష్యం చేసుకుంటూ వచ్చారు. తమకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చెబుతూ వారు ఎన్నికల బహిష్కరణకు పిలుపు కూడా ఇస్తుండేవారు.
తమ వ్యూహాత్మక ఎదురుదాడి ప్రచారం (టిసిఒసి) ఎన్నికలతో మావోయిస్టులు ముడిపెట్టినట్లు భావిస్తున్నప్పటికీ వారు తమ వ్యూహాన్ని రాష్ట్రంలో అమలు జరపకపోవడంతో ప్రస్తుత ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయనవచ్చు. నక్సల్స్ టిసిఒసిని సాధారణంగా ఏడాదిలో రెండుసార్లు డిసెంబర్, జనవరి మధ్య, మే, జూన్ మధ్య అమలు పరుస్తూ, శత్రువుపై, ముఖ్యంగా పోలీసులపై దాడులు సాగిస్తుంటారు. అధిక సంఖ్యలో తీవ్రవాదులు ఈ దాడులు సాగిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ మినహా తీవ్రవాదులు అన్ని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలో గడచిన పదిహేను రోజులలో టిసిఒసిని అమలు జరిపారు. వారు ఈ వ్యవధిలో ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో 30 మందికి పైగా పోలీసు సిబ్బందిని, అనేక మంది పౌరులను హతమార్చారు. వారిలో ఐదుగురు పోలింగ్ సిబ్బందితో సహా 15 మంది గురువారం ఒక్క రోజే ఎన్నికల సంబంధిత దౌర్జన్య సంఘటనలలో ప్రాణాలు కోల్పోయారు.
Pages: 1 -2- News Posted: 18 April, 2009
|