అజారుద్దీన్ సెంచరీ!
మొరాదాబాద్: భారత క్రికెట్ జట్టు సభ్యుడుగా 99 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కు మొరాదాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్ సభకు చేస్తున్న పోటీని వందో టెస్ట్(పరీక్ష)గా అతడితో పాటు పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్ లో అతడు హీరో అవుతాడో లేక జీరోగా మిగిలిపోతాడో ఓటర్లే నిర్ణయించాలి. అతడు మాత్రం విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. గల్లీల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. క్రికెట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తనను చుట్టుముట్టిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఇప్పుడెవరూ ప్రస్తావించకపోవడం అజ్జూ భయ్యాకు మరింత ఊపునిస్తోంది. పట్టణంలోని ఫైజ్ గంజ్ మొహల్లా ప్రాంతంలోని ఇరుకు సందుల్లో అతడు నల్లరంగు టీ షర్టు, జీన్స్ ప్యాంటు వేసుకుని ప్రచారం చేస్తుంటే ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారంతా అతడికి ఓటు వే్స్తారా అన్నదే ప్రశ్నార్ధకం.
1989 ఎన్నికల నుండి మొరాదాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధులెవరూ పార్లమెంటుకు ఎన్నిక కాలేదు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం 10 శాతం ఓట్లు దక్కాయి. ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానవర్గం 2004 ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టలేదు. ఈసారి ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలో చేరిన అజారుద్దీన్ ను మొరాదాబాద్ లో నిలబెట్టి కొత్త ప్రయోగం చేసింది. ఇక్కడి ఓటర్లలో 45 శాతం ముస్లింలు కావడమే ఇందుకు ప్రధాన కారణం. అజారుద్దీన్ కు ఇక్కడి ఓటర్లు పట్టం కడతారని పార్టీ ఆశిస్తోంది. అతడి ప్రత్యర్ధులకు ఓటర్లలో పెద్దగా పలుకుబడి లేనందు వల్ల అజార్ సులభంగా విజయం సాధించగలడని పార్టీ అశిస్తోంది.
Pages: 1 -2- News Posted: 19 April, 2009
|