'రెండో' ప్రచారానికి తెర
హైదరాబాద్: రాష్ట్రంలో రెండోవిడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెర పడనున్నది. ఏప్రిల్ 23న 20 లోక్ సభ, 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగు జరుగుతుంది. తొలివిడత పోలింగులో ఓటర్ల ఆలోచనలను పసిగట్టిన రాజకీయ పార్టీలు ఈ సారి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి మరింత పదును పెట్టారు. రెండో విడతలో ముక్కోణపు పోటీయే ప్రధానంగా ఉంటుందని భావించి ఎవరికి వారే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధులు ముగ్గురితో పాటు అన్ని పార్టీలకు చెందిన హేమా హేమీలు ఈసారి బరిలో ఉన్నందువల్ల వారితో దాదాపు సమానంగా ప్రజాబలం గల నాయకులు, సినీ తారలు ప్రచారం సాగిస్తున్నారు. కోస్తా, రాయలసీమలలో రాజకీయ చైతన్యం అధికమని భావించిన రాజకీయ పార్టీలు ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు.
లోక్ సత్తా, బిజెపి కూడా పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మధ్యే పోటీ ప్రధానంగా ఉన్నందువల్ల మూడు పార్టీల అగ్రనాయకులు విస్తృత ప్రచారంలో నిమగ్నమై వున్నారు. ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో జరిగిన తొలివిడత పోలింగు సరళిని ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. మహళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓటు వేయడం తమకు శుభసూచకమని ఒక పార్టీ భావిస్తుండగా, బిసి ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని మరో పార్టీ ప్రకటించుకుంది. యువత తమకు పట్టం కట్టబోతోందని కొత్త పార్టీ చెబుతోంది.
Pages: 1 -2- News Posted: 20 April, 2009
|