కోస్తాపై పిఆర్పీ చూపు
హైదరాబాద్ : రెండవ దశ ఎన్నికలు జరిగిన కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని 140 శాసనసభ, 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో చిరంజీవి రైలింజన్ వేగం పుంజుకున్నది. ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)కి కోస్తా ఆంధ్రలోని 88 శాసనసభ, 11పార్లమెంటరీ నియోజకవర్గాలలో సగటు ప్రజానీకం నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. కాని రాయలసీమలో మాత్రం కాస్త అటూ ఇటూగా పార్టీకి స్పందన లభించింది. రాయలసీమలో 52 శాసనసభ, 9 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.
పార్టీ కాపు కులస్థుల నమ్మకాన్ని చూరగొనడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలలో భారీగా లబ్ధి పొందినప్పటికీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పార్టీ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ఉభయ గోదావరి జిల్లాలలోని మొత్తం 58 లక్షల మంది ఓటర్లలో కాపులు 21 శాతం మంది ఉన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రలోని 4 జిల్లాలలో 88 నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలలో పోటీ ఉధృతంగా ఉండి నామమాత్రపు తేడాలతో ఫలితాలు రావచ్చునని ఎన్నికల విశ్లేషకులు సూచిస్తున్నారు. ముక్కోణపు పోటీలలో స్థానిక అభ్యర్థులకే మొగ్గు ఉండవచ్చునని, ఇది గెలుపు మెజారిటీని ఒకటి రెండు వందలకు తగ్గించవచ్చునని వారు సూచిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలలో పార్టీ తరఫున పోటీ చేసిన కొందరు ప్రముఖ అభ్యర్థులలో పార్టీ అధ్యక్షుడు కొణిదెల చిరంజీవి (పాలకొల్లు - పగో), కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం - పగో), కోటగిరి విద్యాధరరావు (ఉంగుటూరు - పగో), వంగా గీత (పిఠాపురం - తూగో), తోట త్రిమూర్తులు (రామచంద్రపురం - తూగో), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట - తూగో) కూడా ఉన్నారు.
అయితే, ఈ రెండు జిల్లాలలో గల మొత్తం 34 శాసనసభ నియోజకవర్గాలు (తూర్పు గోదావరిలోని 19, పశ్చిమ గోదావరిలోని 15 నియోజకవర్గాలు)లో తల పండిన కొందరు రాజకీయ పండితులు సూచించినట్లుగా పిఆర్పీ మొత్తం అన్ని స్థానాలనూ కైవసం చేసుకోకపోవచ్చు. ప్రత్యర్థి పార్టీల తరఫున కాపు కులం నుంచి స్థానిక అభ్యర్థులు కొంత మంది నిలబడడం ఇందుకు ప్రధాన కారణం. కాపు నాయకులను నిలబెట్టడంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టిడిపి) వ్యూహం రెండు జిల్లాలలో 'చిరు ప్రభావాన్ని', చిరంజీని ఎన్నికల ప్రయోజనాలను తగ్గించడమే.
Pages: 1 -2- News Posted: 23 April, 2009
|