అందరూ ఆశాజీవులే!
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగు ముగియడంతో, ఇంకా ఫలితాలు వెలవడకుండానే, రాజకీయ పార్టీలు గెలుపు మాదేనంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అధికారం చేపట్టబోయేది తామేనంటూ కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు చెబుతూండగా, క్రితంసారి ఎన్నికల కంటె ఎక్కువ సీట్లు వస్తాయని బిజెపి, కనీసం 10 శాతం ఓట్లు సాధిస్తామని లోక్ సత్తా పార్టీ ప్రకటించడం విశేషం. ప్రధాన పార్టీలైతే గురువారం పోలింగు ముగియగానే స్వీట్లు పంచిపెట్టి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి. పార్టీ ఆఫీసుల్లో కూర్చుని ఏయే ప్రాంతాల్లో ఎన్నెన్ని సీట్లు వస్తాయో లెక్కలు వేశారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, రాష్ట్రంలో గణనీయమైన శక్తిగా లోక్ సత్తా ఆవిర్భవిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రకటించారు.
గతంలో కంటె పార్టీ బలపడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ చెప్పారు. సీట్లు సాధించడం తమ లక్ష్యం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఓటుబ్యాంకు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యమని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తంగిరాల పరంజ్యోతి చెప్పారు. 210 అసెంబ్లీ, 30 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటామని తెలుగుదేశం అధినేత ప్రకటించగా, 230 అసెంబ్లీ, 36 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెబుతున్నారు. మహాకూటమి భాగస్వామ్య పార్టీలైన సిపిఐ, సిపిఎం కూడా గతంలో కంటె ఎక్కువ సీట్లుగెలుచుకుంటామని ప్రకటించాయి.
Pages: 1 -2- News Posted: 24 April, 2009
|