కాంగ్రెస్ కు పిఆర్పీ మద్దతు!
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ పార్టీ కూడా సొంతంగా తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చుననే ఊహాగానాలు సాగుతుండడంతో ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్ల పిఆర్పీ అనుసరిస్తున్న వైఖరినే సూచికగా తీసుకుంటే తదుపరి ప్రభుత్వ స్థాపనలో కాంగ్రెస్ పార్టీకి పిఆర్పీ మద్దతు ఇవ్వవచ్చుననిపిస్తున్నది.
తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని పిఆర్పీ అగ్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ పార్టీకి 70 సీట్ల వరకు రావచ్చునని పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు సూచిస్తున్నారు. పార్టీ పరిస్థితి రెండవ దశలో మెరుగుగా ఉన్నప్పటికీ మొదటి దశలో అంతగా సత్తా చూపలేకపోయిందని, ఫలితంగా సాధారణ మెజారిటీ కన్నా తక్కువ సంఖ్యలోనే సీట్లు రావచ్చునని వారు వాదిస్తున్నారు.
పార్టీకి 70 సీట్లు రావచ్చునని, హంగ్ శాసనసభ ఏర్పడవచ్చునని, కాంగ్రెస్, టిడిపిల ఓట్లు కొన్నిటిని పార్టీ రాబట్టుకోవడం ఇందుకు కారణమని పిఆర్పీలోని అనుభవజ్ఞులైన నాయకులు అభిప్రాయపడుతున్నారు. రెండవ దశ పోలింగ్ అనంతరం వారు ఈ అంచనాకు వచ్చారు. వారి అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ కు 110, మహా కూటమికి 90 సీట్లు రావచ్చు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ కు పిఆర్పీ మద్దతు అవసరం కాగలదు.
అయితే, మహా కూటమికి 110 సీట్లు వచ్చే అవకాశం లేకపోలేదని, కాంగ్రెస్ కు వచ్చే సీట్లు 100కు మించకపోవచ్చునని పిఆర్పీలోని వెటరన్ నాయకులు సూచిస్తున్నారు. ఆ రెండు సందర్భాలలో గణనీయ సంఖ్యలో సీట్లు లభించే ఏకైక పార్టీ పిఆర్పీ మద్దతు కాంగ్రెస్ కు అవసరం కావచ్చునని వారు అంటున్నారు. మహా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని వారు భావిస్తున్నారు. అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ కు పిఆర్పీ మద్దతు కావలసి ఉంటుందని వారు అంటున్నారు.
Pages: 1 -2- News Posted: 27 April, 2009
|