వినుకొండపై 40 కోట్ల వర్షం
హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యధికంగా ఎన్నికల వ్యయం గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి), ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) డబ్బు, మద్యం, ఇతర రాయితీలతో వోటర్లను ప్రలోభపెట్టడానికి రూ. 40 కోట్ల మేరకు ఖర్చు చేశాయి. ఎన్నికల నిఘా సంస్థ 'ఎలక్షన్ వాచ్' సోమవారం ఈ విషయం వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, గుంటూరు (వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గం రూ. 30 కోట్ల వ్యయంతో రెండవ స్థానం ఆక్రమించింది. అన్ని గ్రామాల నుంచి స్థానిక స్థాయి వాలంటీర్లు పంపిన నివేదికల ఆధారంగా ఈ విషయాన్ని సంస్థ తెలియజేసింది. వినుకొండ నియోజకవర్గంలో ఆ పార్టీల అభ్యర్థులు ముగ్గురూ పారిశ్రామికవేత్తలేనని తెలుస్తున్నది. వినుకొండలో ఖర్చు చేసిన రూ. 40 కోట్లలో టిడిపి అభ్యర్థి వివిఎస్ ఆంజనేయులు వాటా రూ. 15 కోట్లు అని, పిఆర్పీ అభ్యర్థి బ్రహ్మ నాయుడు వాటా రూ. 13 కోట్లు అని, కాంగ్రెస్ అభ్యర్థి చేబ్రోలు నరేంద్రనాథ్ వాటా రూ. 12 కోట్లు అని రాష్ట్ర ఎలక్షన్ వాచ్ కో - కన్వీనర్ వి. లక్ష్మణ్ రెడ్డి వివరించారు.
ఆంజనేయులు శివశక్తి గ్రూపు సంస్థల చైర్మన్ కాగా నరేంద్రనాథ్ మాజీ మంత్రి చేబ్రోలు హనుమయ్య కుమారుడు, చేబ్రోలు టొబాకో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఇక పిఆర్పీ అభ్యర్థి బ్రహ్మ నాయుడు తిరుమల డెయిరీ యజమాని. రాష్ట్రంలోని భారీ డెయిరీ కంపెనీలలో ఈ సంస్థ ఒకటి. ముగ్గురు అభ్యర్థులూ వేర్వేరు మార్గాలలో వోటర్లకు రూ. 40 కోట్లు పంపిణీ చేసినట్లు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. కొన్ని కేసులలో గ్రామ పెద్దకు నేరుగా డబ్బు అందజేశారు. ఆయన దానిని వోటర్లకు పంపిణీ చేశారు. మరొక పార్టీ అభ్యర్థి స్వయం సహాయక గ్రూపుల మహిళా సభ్యుల అకౌంట్లలో డబ్బు జమ చేశారు. ఈ విధంగా నియోజకవర్గంలో 2 లక్షల మంది వోటర్లలో 50 శాతం మందికి పైగా డబ్బు అందుకున్నారు. కొందరు గ్రామస్థులకు ప్రతి పార్టీ నుంచి రూ. 500 వంతున, మరి కొందరికి రూ. 1000 లేదా రూ.2000 వంతున డబ్బు అందింది. ముగ్గురు అభ్యర్థులూ గ్రామాలను 'కొనుగోలు' చేయడానికి పరస్పరం పోటీ పడ్డారు. అయితే, వోటర్లకు డబ్బు పంపిణీలో టిడిపి అభ్యర్థిదే పైచేయి అయిందని ఎన్నికల నిఘా సంస్థ అధికారులు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 28 April, 2009
|