జ్యోతిష్కులతో సందిగ్ధం
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సన్నిహితులైన జ్యోతిష్కులు పార్టీ విజయావకాశాలపైన, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీపైన పార్టీ నాయకులను అయోమయంలో ముంచెత్తుతున్నారు. మే 16న ఫలితాలు ప్రకటించినప్పుడు తనకు లభించే సీట్ల సంఖ్యపై టిడిపి ఇప్పటికే గందరగోళ స్థితిలో ఉంది. పార్టీలో అయోమయాన్ని పెంచుతూ టిడిపి జ్యోతిష్కులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు వేర్వేరు ముహూర్తాలు సూచించారు.
పార్టీ వర్గాలలో తన జోస్యాలకు పేరొందిన బి.వి. మోహనరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా మే 22న ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు. ఇది చంద్రబాబుకు అత్యంత అనుకూలమైనదని మోహనరెడ్డి అభిప్రాయం. అయితే, పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేస్తుండే మరొక జ్యోతిష్కుడు గార్గేయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబుకు దివ్యమైన ముహూర్తం మే 20 అని సూచించారు. గార్గేయ అభిప్రాయం ప్రకారం, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారం నిలబెట్టుకునేటట్లయితే ఆయనకు ప్రమాణ స్వీకారానికి అత్యంత అనువైన తేదీలు మే 18 లేదా 20. రాజశేఖరరెడ్డి 2004లో పూర్వాభాద్ర నక్షత్రం ఉన్న రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఈ సంవత్సరం మే 18న ఆ నక్షత్రం ఉందని జ్యోతిష్కులు చెబుతున్నారు. రాజశేఖరరెడ్డికి తిరిగి పగ్గాలు చేపట్టడానికి అదే నక్షత్రం అత్యంత అనువైనదని వారు సూచిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 2 May, 2009
|