లాలూకు మిత్రులే ప్రత్యర్థులు
పాట్నా : రాజకీయాలు శత్రువులను మిత్రులుగాను, మిత్రులను శత్రువులుగాను మార్చగలవు. పాటలీపుత్ర లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు ఈ కఠోర సత్యం ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు - రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్ జెడి), రాజ్యసభ మాజీ సభ్యుడు, పాట్నా విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు రంజన్ ప్రసాద్ యాదవ్ (జెడి యు), మాజీ ఎంపి విజయ్ సింగ్ యాదవ్ (కాంగ్రెస్) అసలు ఒకే రాజకీయ పార్టీ ఆర్ జెడికి చెందిన వారు. ఎన్నికలు వచ్చేంత వరకు కూడా వారు ముగ్గురూ అత్యంత సన్నిహితంగా మెలగేవారు. పార్టీ అనుబంధాలు మారిపోయాయి. వారి మధ్య సంబంధాలు కూడా తదనుగుణంగా మారిపోయాయి.
ఒక దశాబ్దం క్రితం వరకు కూడా లాలూకు సన్నిహిత మిత్రుడైన రంజన్ ఇప్పుడు నిత్య విమర్శకుడు లేదా బద్ధ విరోధి. వారి మధ్య స్నేహం వారు విద్యార్థులుగా ఉన్నరోజులది. వారు పాట్నా విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ ఎన్నికలలో చురుకుగా పాల్గొనేవారు. లాలూ 1977లో ఎంపిగా ఎన్నికైనప్పుడు వారి మధ్య మైత్రి బలపడింది.
ఎలా అయినా పనులు జరిపించే నైపుణ్యం ఉన్న కారణంగా లాలూ 'దీమాగీ లాల్'గా అభివర్ణించే రంజన్ 1990లో బీహార్ ముఖ్యమంత్రి పదవిని లాలూ అధిష్ఠించేందుకు సాయం చేశారు. అందుకు ప్రతిఫలంగా లాలూ ఆయనను రాజ్యసభకు ఎన్నికయ్యేట్లు చూడడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నత విద్య రంగం నిర్వహణలో స్వేచ్ఛ ఇచ్చారు. అయితే, 1996లో తొలి యునైటెడ్ ఫ్రంట్ (యుఎఫ్) ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు రాజకీయ అనుభవం విషయంలో రంజన్ కు జూనియర్ అయిన కాంతి సింగ్ ను లాలూ యాదవ్ ప్రేరణతో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Pages: 1 -2- News Posted: 4 May, 2009
|