కెసిఆర్ కరుణకై తంటాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సాధారణ మెజారిటీ లభించదనే అనుమానం తొలుస్తున్నదేమో తెలుగు దేశం పార్టీ (టిడిపి) నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తమ చేతిలో నుంచి జారిపోకుండా చూసుకోవాలనుకుంటున్నారు. టిఆర్ఎస్ నెమ్మదిగా ఇతర పార్టీల వైపు దృష్టి మళ్ళించకుండా టిడిపి నాయకులు జాగ్రత్త పడాలనుకుంటున్నారు.
ఒక వేళ తమకు మెజారిటీ లభించకపోయినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు కోసం టిఆర్ఎస్ మద్దతు కీలకం కాగలదని టిడిపి నాయకులు భావిస్తున్నారు. టిఆర్ఎస్ మహా కూటమి (జిఎ)లో కొనసాగగలదని ఎంతగా చెబుతున్నప్పటికీ కె. చంద్రశేఖరరావు 'రాజకీయ అడుగుల'పై ఒక కన్ను వేసి ఉంచుతున్నారు. హంగ్ శాసనసభ ఏర్పడిన పక్షంలో కూటమి భాగస్వామ్య పక్షాలు - టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ మద్దతు టిడిపికి కావలసి వస్తుంది. తదుపరి ప్రభుత్వంలో మిత్ర పక్షాలను చేర్చుకోవాలని కూడా టిడిపి అనుకుంటున్నది. అంటే రాష్ట్రంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పడుతుందన్నమాట.
టిఆర్ఎస్ పార్టీని బుజ్జగించే విధానంలో భాగంగా టిడిపి ఆ పార్టీ చెబుతున్న అన్ని షరతులకూ అంగీకరిస్తున్నది. వాటిలో భాగంగా 13వ శాసనసభ తొలి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తికి అనుకూలంగా ఒక తీర్మానం ఆమోదించేందుకు తమకేమీ అభ్యంతరం లేదని టిడిపి చెబుతున్నది. శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీ తిరుగుబాటు అభ్యర్థులపై టిడిపి క్రమశిక్షణ చర్య తీసుకోగలదని పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి సోమవారం హామీ ఇచ్చారు.
Pages: 1 -2- News Posted: 5 May, 2009
|