రెండులో ఒక్కదానికే ఓటు
హైదరాబాద్ : అమాయకత్వం వల్ల గాని, ఉద్దేశపూర్వకంగా గాని కనీసం లక్షా 36 వేల మంది మహిళా ఓటర్లు రాష్ట్రంలో ఇటీవల ముగిసిన రెండు దశల ఎన్నికలలో లోక్ సభకు ఓట్లు వేయలేదు. శాసనసభ ఎన్నికలలో ఇదే విధంగా 94 వేల మంది పురుష ఓటర్లు తమ ఓట్లు వేయలేదు. రాష్ట్రంలో రెండు దశల పోలింగ్ ముగిసిన తరువాత ఎన్నికల కమిషన్ (ఇసి) విడుదల చేసిన గణాంకాలను బట్టి ఇది విదితమవుతున్నది. జిల్లాల వారీ అందిన గణాంక వివరాలను బట్టి లక్షా 36 వేల మంది మహిళా ఓటర్లు ఒక్క ఓటు అదీ అసెంబ్లీకి మాత్రమే వేశారని, 94 వేల మంది పురుష ఓటర్లు ఒక్క ఓటు అదీ లోక్ సభకు మాత్రమే వేశారని తెలుస్తున్నది.
ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చినప్పుడు దిగ్భ్రాంతి చెందిన ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) ఐ.వి. సుబ్బారావు ఈ డేటా సంకలనంలో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చునని అన్నారు. ఆయన ఈ విషయమై రిటర్నింగ్ అధికారులు అందరితో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం, పోలింగ్ కేంద్రంలో ఇవిఎంలు ఉన్న విభాగంలో ఓటు కోసం వెళ్ళిన ఓటరు రెండింటి బటన్లు నొక్కిన తరువాతే ప్రిసైడింగ్ అధికారి క్యూలో ఉన్న తదుపరి ఓటర్ ను పిలవాలి. రెండు ఇవిఎంలలో ఒకటి లోక్ సభకు, రెండవది అసెంబ్లీకి ఉద్దేశించినవి.
కమిషన్ విడుదల చేసిన గణాంకాలు జిల్లాల వారీవి కనుక ఓటరు లోక్ సభ, శాసనసభ రెండింటిలో ఒక్కదానికే ఓటు వేయాలని ఉద్దేశపూర్వకంగానే నిర్ణయం తీసుకున్నారా అనేది తేల్చడం కష్టం. 'ఆ గణాంకాలు నిజమే అయినట్లయితే, చాలా కేసులలో అమాయకత్వం వల్లే అలా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే రెండు ఇవిఎంలు ఉన్నాయని, లోక్ సభకు ఒకటి, శాసనసభకు రెండవది అని, తాను ముందు ఒక ఇవిఎం బటన్ ను, ఆతరువాత రెండవ ఇవిఎం బటన్ ను నొక్కవలసి ఉంటుందని ఓటర్ కు తెలిసి ఉండకపోవచ్చు' అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 6 May, 2009
|