ఈ నేతలు పిసినారులట!
హైదరాబాద్ : ఎన్నికల ప్రవర్తన నియమావళిని తు చ తప్పకుండా పాటించడంలోను, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పర్యవేక్షించడంలోను ఎన్నికల కమిషన్ (ఇసి) కఠినంగా వ్యవహరిస్తుండవచ్చు. కాని రాజకీయ నేతలు ఎప్పుడూ ఒక అడుగు ముందుకే ఉంటారు. ముఖ్యంగా ఎన్నికల ఖర్చుల విషయంలోనైతే ఇక చెప్పనే అక్కరలేదు. ఈ ఎన్నికలలో తాము చేసిన వ్యయం ఇదీ అంటూ వారు సమర్పించిన లెక్కలు చూడగానే ఈ విషయం విదితమవుతుంది.
లోక్ సభ ఎన్నికలలో ఒక్కొక్క అభ్యర్థికి గరిష్ఠ వ్యయ పరిమితి రూ. 25 లక్షలని, శాసనసభ స్థానాల విషయంలోనైతే ఈ పరిమితి రూ. 10 లక్షలని అందరికీ విదితమే. తన డిపాజిట్, వాహనాలు, హెలికాప్టర్ బాడుగ, డ్రైవర్ల బేటా, లౌడ్ స్పీకర్ల బాడుగ, కరపత్రాలు, వోటర్ స్లిప్పుల ముద్రణ, సైకిల్ ర్యాలీల నిర్వహణ, నమూనా ఇవిఎంల నిర్వహణ, ఇంటింటి ప్రచారం కోసం అభ్యర్థి ఖర్చు చేసే మొత్తాన్ని సదరు అభ్యర్థి ఎన్నికల వ్యయంలో భాగంగానే పరిగణిస్తారు.
వివిధ అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల గణాంక వివరాలను బట్టి హైదరాబాద్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తన ఖర్చు పరిమితి రూ. 25 లక్షలు అయినప్పటికీ కేవలం రూ. 3.67 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తున్నది. ఆయన సోదరుడు, హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానానికి ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ కూడా రూ. 3.43 లక్షలు ఖర్చు చేశారు. ఆయన వ్యయ పరిమితి రూ. 10 లక్షలు. ఇక అసదుద్దీన్ ఒవైసీ ప్రత్యర్థి, తెలుగు దేశం పార్టీ (టిడిపి) అభ్యర్థి జహీద్ అలీ ఖాన్ రూ. 2.99 లక్షలు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి రూ. 2.18 లక్షలు వ్యయం చేశారు.
'ఇదంతా వట్టి బూటకం. ఏడు అసెంబ్లీ స్థానాలతో కూడుకున్న లోక్ సభ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయినా అసెంబ్లీ అభ్యర్థి చేసే ఖర్చులో సగమే ఎలా ఖర్చు చేయగలరు? అసలు వ్యయం కోట్ల రూపాయలలో ఉంటుంది. కాని రాజకీయ నాయకులు అన్నిటా ఆరితేరినవారు కదా. తమ వ్యయ పరిమితిలో పది, పదిహేను శాతం మించకుండా చూపించడం వారు అలవాటు చేసుకున్నారు' అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 10 May, 2009
|