ఎన్డీఏకు టిడిపి నో
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టిడిపి) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ)లో చేరదు. దానికి బదులు కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విశేషంగా పాటుపడగలరు. కాగా, ప్రధాని పదవికి ఆయన తనంతట తానుగా ప్రయత్నించరు. కాని తనకు ఆ పదవిని ఇవ్వజూపితే చంద్రబాబు తిరస్కరించకపోవచ్చు.
ఎన్ డిఎతో పొత్తు పెట్టుకున్న కారణంగానే క్రితం సారి ఎన్నికలలో అధికారం కోల్పోయినట్లు టిడిపి భావిస్తున్నదని పార్టీలోని అభిజ్ఞ వర్గాలు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో చెప్పాయి. 'ఈ పొత్తు కారణంగా పార్టి 2004 ఎన్నికలలో పది శాతం వోట్లను కోల్పోయింది. ఇదే పొరపాటును మేము మరొకసారి చేయకపోవచ్చు' అని పార్టీ ఆంతరంగికులు స్పష్టం చేశారు. 'ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక యుపిఎకు మద్దతు ఇవ్వడానికి కేంద్రంలో ఆ పార్టీతో టిడిపి చేతులు కలపదు కూడా' అని ఆ వర్గాలు తెలిపాయి. 'చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత అమలు పరచడం కోసం కార్యక్రమాలను సిద్ధం చేశారు. అందువల్ల ఆయన ప్రధాని పదవిని కోరుకోరు' అని ఆ వర్గాలు వివరించాయి.
మహాకూటమి భాగస్వామ్య పక్షం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) లూధియానాలో ఎన్ డిఎ ర్యాలీకి హాజరైన నేపథ్యంలో ఎన్ డిఎతో చేతులు కలిపేది లేదంటూ టిడిపి నుంచి స్పష్టీకరణ వచ్చింది. ఢిల్లీలో ఏ సంకీర్ణం అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ దానితో కలసి సాగుతుందని టిడిపి భావిస్తున్నదని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఎన్ డిఎతో చేతులు కలిపినట్లుగా టిఆర్ఎస్ నటిస్తున్నదని టిడిపి భావిస్తున్నది.
చంద్రబాబు నాయుడు ఇప్పటికే తృతీయ ఫ్రంట్ లో చేరబోయే పార్టీల నాయకులతో అప్పుడే చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 16న ఫలితాలు వెలువడి తరువాత ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగవచ్చు. 'మే 16 తరువాత కూటమికి ఒక రూపు తీసుకురావడానికి దాదాపు పది రోజులు పట్టవచ్చునని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, ఏదైనా ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది' అని పార్టీ ఆంతరంగికులు చెప్పారు. వామపక్షాలు కాకుండా జయలలిత, నవీన్ పట్నాయక్, మాయావతి, దేవేగౌడ, పలువురు ఇతరులు సంకీర్ణంలో భాగస్వాములు కావచ్చునని వారు ఆశిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 12 May, 2009
|