ఎన్డీఏ వైపు చిరు మొగ్గు?
హైదరాబాద్ : కాషాయ పరివారంతో భుజం భుజం కలిపి తిరగాలన్న మోజు ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధినేత చిరంజీవికి బాగా ఎక్కువగా ఉన్నట్లున్నది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి), తృతీయ ఫ్రంట్ వలలో పడడానికి నిరాకరించిన పిఆర్పీ క్రమంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) ఆకర్షణకు లోనవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
నాలుగవ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వడం మంచిదని చిరంజీవి ఆదిలో అభిప్రాయపడ్డారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ కు ప్రధాని కాగల అర్హతలు ఉన్న నాయకుడని చిరంజీవి ప్రకటించారు కూడా. అయితే, నాలుగవ ఫ్రంట్ ఇంకా పూర్తిగా రూపు దిద్దుకోలేదు. పిఆర్పీ వర్గాల సమాచారం ప్రకారం, కేంద్రంలో మితవాద పార్టీతో కలసి రాజకీయ యాత్ర సాగించడం అర్థవంతంగా ఉంటుందని, ఇది ఉభయులకూ ప్రయోజనకరం కాగలదని చిరంజీవికి నచ్చజెప్పడానికి బిజెపి ఎంపి, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును తన వైపు తిప్పుకొన్న తరువాత బిజెపి తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా సానుకూల సంకేతాలు పంపింది. అయితే, ఆ కాషాయ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని టిడిపి నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు నాయుడును తన వైపు తిప్పుకోవడానికి బిజెపి గట్టి ప్రయత్నాలు ప్రారంభించగలదు.
వాస్తవానికి ఇప్పటికే బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు టిడిపి, పిఆర్పీలను అనవసరంగా విమర్శించవద్దని తన పార్టీ సభ్యులను కోరారు. రాష్ట్రంలో టిడిపి ఏకైక పెద్ద పార్టీగా అవతరించగలదని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్ డిఎకు మద్దతు ఇచ్చేటట్లయితే రాష్ట్రంలో టిడిపికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని దత్తాత్రేయ తెలియజేశారు కూడా.
Pages: 1 -2- News Posted: 14 May, 2009
|