సైన్యం-సారథి-విజేత
హైదరాబాద్ : ఒంటరి పోరాటం. ప్రయోజనం పొందిన సామాన్యుల మీద అంతులేని నమ్మకం. సంక్షేమ, అభివృద్ధి పథకాల మీద అచంచల విశ్వాసం. సీనియర్లు నివ్వెరపోయే తెగింపుతో, ప్రత్యర్ధులు కూడా ఊహించని ఎత్తుగడలతో, తెలంగాణా అంశంపై సాహసోపేతమైన నిర్ణయంతో యోధునిలా సాగించిన పోరాటం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని మరోసారి అధికార పీఠాన్ని ఎక్కించింది. కాంగ్రెస్ ను ఓడించడమే ధ్యేయమని, వైఎస్ ను గద్దె దింపడమే లక్ష్యమని బహిరంగంగా ప్రకటించి ఒక్కటై యుద్ధం ప్రకటించిన మహాకూటమి, మెగా కూటమిలను మట్టి కరిపించిన విజేత వైఎస్. ఈ ఎన్నికల్లో పార్టీని అన్నీ తానై నడిపించిన మొండిఘటం. ప్రత్యర్ధి పార్టీలు ప్రచారంలో సినీ గ్లామర్ స్టార్లు హొరెత్తిస్తుంటే, మీసాలు మెలేస్తుంటే, తొడలు కొడుతుంటే కాంగ్రెస్ తరఫున ప్రజా స్టార్ తానేనని, సాగునీటి, సంక్షేమ పథకాలే అస్త్రాలని చెబుతూ తానే సైన్యమై, సారధైన వైఎస్ కు తెలుగు ప్రజలు నీరాజనాలు పట్టారు. మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలా ఆయనే అర్హుడని నిర్ద్వందంగా తేల్చి చెప్పారు.
ఈ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్ధుల జాబితాను హస్తినలో ఖరారు చేయించుకుని వచ్చిన తరువాత `ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు ఓటములకు నాదే పూర్తి బాధ్యత ' అని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించి పార్టీలోని అంతర్గత విమర్శకుల నోటికి తాళాలు వేశారు. ఓడితే ప్రతపక్షంలో కూర్చోడానికైనా సిద్ధమే కాని పొత్తుల కోసం పరాయి పార్టీలను దేబిరించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికలను ఎదుర్కోడానికి సంవత్సరం ముందునుంచి కసరత్తు చేసి, వయోవృద్ధులైన వారిని, పనిచేయని ఎమ్మేల్యేలను పక్కన పెట్టిన ధీశాలి. పార్టీలోని తెలంగాణా వాదుల రగడను ఎంత మాత్రం పట్టించుకోకుండా, ఎవరిసాయం లేకుండానే, తెలంగాణ హమీ ఇవ్వకుండానే పార్టీని గెలిపించుకోస్తానని అధిష్టానానికి హామీ ఇచ్చి తన పంతం నెగ్గించుకున్న ఏకైక నాయకునిగా వైఎస్
నిలబడ్డారు.
Pages: 1 -2- News Posted: 16 May, 2009
|