తెలంగాణా తెల్లబోయింది
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణా సాధన ప్రధాన ఆయుధంగా, ఏకైక ఎజెండాగా పేర్కొంటూ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన తెరాస తాజా ఎన్నికల్లో చతికిలపడింది. ఈ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల ఆశయాలకు ప్రతినిధిగా గడిచిన ఆరేళ్ల కాలంలో మిగతా రాజకీయ పార్టీల నాయకులకంటే విలక్షణతను చాటుకున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఘన విజయాలు సాధించిన తెరాస ఆ తర్వాత రెండేళ్లూ తెలంగాణ ఏర్పాటు నినాదంతో కదంతొక్కింది. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇవ్వదని గ్రహించిన కెసిఆర్ ఆ తర్వాత చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మంత్రివర్గం నుంచి తప్పుకోవడం, ఎమ్మెల్యేలు, ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికల్లో చావు దెబ్బ తినడం వంటి పరిణామాలకు కెసిఆరే సృష్టికర్త. ప్రతిసారీ పది రోజుల్లో ప్రత్యేక తెలంగాణ, వంద రోజుల్లో ప్రత్యేక తెలంగాణ అంటూ గడువులు పెడుతూ రేపో మాపో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందనే భ్రమల్లో ఆయన తనను నమ్ముకున్న ప్రజలను ఉంచారు. ఈసారి తెలుగుదేశంతో అవగాహన కుదుర్చుకుని, ఎన్నికలు అవగానే, ఫలితాలు రాకుండానే ఆ పార్టీకి గుడ్ బై కొట్టి కేంద్రంలో బీజేపీ (ఎన్డీయే) గూటికి చేరారు. తీరా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కెసిఆర్ జోస్యం వికటించింది. తెరాస తెలంగాణ ప్రాంతంలో మున్నెన్నడూ లేనంత హీనస్థితికి దిగజారిపోయింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యత సాధించడం, తెలంగాణాలో తెరాస వైభవాన్ని కోల్పోవడం కేవలం పార్టీ బలాబలాల వృద్ధి, క్షీణతను మాత్రమే సూచించడం లేదు. తెలంగాణ ప్రజలు నిజంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదన్న సమైక్యవాదుల వాదానికి ఎంతో కొంత బలం చేకూర్చింది. తెలంగాణలోని సామాన్య ప్రజలకంటే నాయకులు, మేధావులు, రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్న పెద్దలు మాత్రమే ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని వాడుకుంటున్నారన్న ప్రచారం సరైనదేనని వాదనలు లేవనెత్తడానికి ఈ ఫలితాలు అవకాశాన్ని కల్పించాయి.
Pages: 1 -2- News Posted: 19 May, 2009
|