సామర్థ్యానికే సింగ్ ఓటు
న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్తగా ఏర్పడే మంత్రి మండలిపై డాక్టర్ మన్మోహన్ సింగ్ ముద్ర పడవచ్చు. పని తీరు, సామర్థ్యం, జవాబుదారీతనానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. శుక్రవార ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల సంఖ్యను 60కి పరిమితం చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు గురించిన చర్చలతోనే సోమవారం ఎక్కువ సమయం గడిపారు. మందకొడిగా ఉండేవారికి, పని చేయనివారికి కొత్త మంత్రివర్గంలో తావు ఇవ్వరాదని ఆయన పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తున్నది.
2004, 2009 సంవత్సరాల మధ్య ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఇంటా, బయట అసంఖ్యాకంగా సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ బాగానే పని చేసిందని మన్మోహన్ అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీల సమాహారంగా కన్నా అధికార యంత్రాంగం మాదిరిగా ఎక్కువగా యుపిఎ పని చేసింది. మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి), హోమ్ (పి. చిదంబరం బాధ్యతలు స్వీకరించేంత వరకు) మంత్రిత్వశాఖలు పేలవంగా పని చేశాయి. మంత్రులు పరస్పరం విభేదించుకున్నారు. జూనియర్లను పక్కకు నెట్టేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైన జవాబుదారీతనాన్ని పట్టించుకున్నవారు చాలా కొద్ది మందే.
వాస్తవానికి మంగళవారం మంత్రివర్గం చివరి సమావేశం మన్మోహన్ కు గతాన్ని అనుభవంలోకి తెచ్చింది. లాలూ ప్రసాద్ నిందాగర్భిత వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను, అత్యంత ప్రతిభా వ్యుత్పత్తులతో పని చేసినందుకు ప్రధానిని అభినందించేందుకు మంత్రివర్గం సమావేశం అయింది. 15వ లోక్ సభకు ఎన్నిక కాలేకపోయిన 16 మంది మంత్రుల తరఫున మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. రామ్ విలాస్ పాశ్వాన్ సహచరులకు వీడ్కోలు పలికారు. లాలూ ప్రసాద్ యాదవ్ అందరి కన్నా చివరగా మాట్లాడారు. తనను 'అవమానించినందుకు' కాంగ్రెస్ ను ఆయన నిందించారు. తిరుగులేని రీతిలో మద్దతు ఇచ్చినందుకు తన పార్టీ ఆర్ జెడికి కృతజ్ఞతలు చెప్పడానికి బదులు కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్, రాజీవ్ శుక్లా, పృథ్వీరాజ్ చవాన్ టివి స్టూడియోలలో తనపై విమర్శలు చేశారని లాలూ ఆక్షేపించారు. ఆయనను శాంతింపచేయడానికి ప్రణబ్ ముఖర్జీ ప్రయత్నించారు. కాని మన్మోహన్ మౌనం వహించారు.
ఆర్థిక మంత్రి ఎంపిక మన్మోహన్ బలానికి పరీక్ష కాగలదని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడతున్నాయి. అయితే, అందరి దృష్టీ సోనియా గాంధిపైనే ఉంది. ఆర్థిక మంత్రి ఎంపికలో మన్మోహన్ అభీష్టాన్ని సోనియా మన్నిస్తారా లేదా చూడాలని వారు ఆ వర్గాలు అనుకుంటున్నాయి. రాజకీయ నాయకుని కన్నా ప్రొఫెషనలే ఈ పదవికి అత్యంత అర్హుడని మన్మోహన్ భావన. అందువల్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాకే ఈ పదవి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Pages: 1 -2- News Posted: 19 May, 2009
|