మద్దతు కోసం పోటాపోటీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని తిరిగేందుకు పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. సాధారణ మెజారిటీకి 11 మంది ఎంపిలు కొరవడిన కాంగ్రెస్ సారథ్యంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కి ఆ లోటును భర్తీ చేసుకోవడం సమస్యేమీ కాదు. కాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని 'సెక్యులర్' ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇవ్వనున్నట్లు ములాయం సింగ్ యాదవ్, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్, హెచ్.డి. దేవెగౌడ ప్రకటించడంతో తనకు వెన్నంటి నిలుస్తామంటున్న పార్టీల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో కాంగ్రెస్ కు ఏమి చేయాలో పాలుపోని స్థితి ఎదురవుతున్నది.
బద్ధ శత్రువులైన సమాజ్ వాది పార్టీ (ఎస్ పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) ఎటువంటి షరతులూ లేకుండా మద్దతు ఇస్తూ నాణేనికి ఒకే వైపు నిలుస్తుండగా దేవెగౌడ నాయకత్వంలోని జనతా దళ్ (ఎస్), లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో ఎంపిల సంఖ్య పరంగా కుంచించుకుపోయిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) కూడా శీఘ్రంగా మద్దతు లేఖలపై సంతకాలు చేయడంతో కాంగ్రెస్ ఎవరి బ్లాక్ మెయిల్ కూ లొంగవలసిన పని లేకపోతున్నది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని బెదరించి లొంగదీసుకోవడం ఇక అసాధ్యమే అవుతుంది.
ఇందులో ఉన్న ప్రయోజనాన్ని గుర్తించిన కాంగ్రెస్ తనకు మద్దతు ఇస్తున్న పార్టీలు వేటినీ నిరుత్సాహపరచడం లేదు. వాస్తవానికి డిఎంకె అధ్యక్షుడు ఎం. కరుణానిధి ఢిల్లీకి చేరుకున్న సమయానికే అందరి మద్దతునూ సమీకరించి సిద్ధంగా ఉన్నది. ఇది కేవలం కాకతాళీయం కాదనిపిస్తున్నది. ఎందుకంటే ఉపరితల రవాణా, నౌకాయాన, ఆరోగ్య, రైల్వే, పర్యావరణం వంటి ప్రధాన శాఖలతో సహా ఏడు మంత్రి పదవులను డిఎంకె కోరినట్లు తెలుస్తున్నది.
Pages: 1 -2- News Posted: 20 May, 2009
|