తెరాసలో ప్రక్షాళన
హైదరాబాద్ : అపజయాలకు కారణమైన అంశాలను నిర్థారించే ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణా ప్రాంతంలో నానాటికీ దిగజారిపోతున్న పార్టీ ప్రతిష్టను, ప్రజలలో కోల్పోతున్న విశ్వాసాన్నీ కాపాడుకోవడానికి అనుసరించ వలసిన విధానాలకు రూపకల్పన చేస్తోంది. క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించే సామర్ధ్యం వున్న వ్యక్తులకు నాయకత్వం అప్పగించాలని కృతనిశ్చయంతో వుంది. ప్రస్తుతం వున్న రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తిగా తొలగించాలని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు తెలిసింది. తాజా ఎన్నికల్లో తెరాస ఘోర పరాజయం పొందిన తరువాత అధినేత కేసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్లిన కెసిఆర్ అదే స్థాయిలో తెలంగాణ వాదాన్ని కృంగదీశారనే వాదనలు మొదలు కావడంతో పార్టీని సమూలంగా మరమ్మతు చేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు వేసిన ఎత్తుగడలు, వీటిలో విజయవంతమైన అంశాలు, విఫలమైన సందర్భాల్లో కారణాలేమిటి అనే అంశాలపై మేధోమథనం జరుపుతున్నట్టు తెలుస్తోంది. తెరాస గతంలో ఉత్తర తెలంగాణలో బలంగా తన ప్రభావాన్ని చూపించినా దక్షిణ తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. దక్షిణాదిన కూడా పార్టీని బలోపేతం చేసేందుకే సాహసోపేత నిర్ణయం తీసుకుని పార్టీ ఉనికే లేని మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి కెసిఆర్ పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలుస్తాడని ఊహించిన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు తారుమారై `చావు తప్పి కన్ను లొట్ట బోయిన' చందంగా స్వల్ప మెజారిటీతో కెసిఆర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలోనే కాకుండా ఉత్తర తెలంగాణలో కూడా కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ అపజయంపై కారణాలు తెలుసుకునేందుకు కెసిఆర్ ఫలితాలు వెల్లడైన దగ్గర నుంచి పలువురు తెలంగాణ వాదులతో తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వాదం లేదనీ, తెలంగాణ ప్రజలు కూడా సమైక్యవాదాన్నే కోరుకుంటున్నారని పలువురు కోస్తా, రాయలసీమకు చెందిన కాంగ్రెస్ నాయకులు గతంలోనే గట్టిగా వాదించారు. వీరి వాదనకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు రావడం తెరాసను కృంగదీసింది. నిజంగా తెలంగాణ వాదం బలహీన పడిందా? అనే అనుమానం కూడా తెరాసలో ఎక్కువైంది.
Pages: 1 -2- News Posted: 21 May, 2009
|