పనికిరాని వీర విధేయత
న్యూఢిల్లీ : అర్జున్ సింగ్ విధేయత పరీక్షలో నెగ్గడం గురించి ప్రతి కాంగ్రెస్ వాది భయపడిన సమయం ఉంది. 'పరిపూర్ణ విధేయుని' దృష్టిలో ఇతరులంతా అనుమానితులే. కాని విచిత్రంగా శుక్రవారం కేంద్ర మంత్రుల మొదటి బృందం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కుయుక్తుల వృద్ధ సింహం సుదీర్ఘ రాజకీయ జీవితానికి తెర పడినట్లయింది.
అర్జున్ సింగ్ వేసిన తప్పటడుగులు, చేసిన దుస్సాహసాలు పెక్కింటితో విసుగెత్తి పోయి కావచ్చు ఆయన వీర విధేయతతో కొలిచిన నాయకత్వమే ఆయనను చరిత్ర చెత్తబుట్టపాలు చేసింది. అర్జున్ సింగ్ రాజకీయ జీవితం ముగింపు ఇంత దారుణంగా ఉండవలసింది కాదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అఖండ విజయం సాధించి, అధికారాన్నిసుదృఢం చేసుకుంటున్న తరుణంలో పార్టీ ప్రధాన నాయకులలో ఒకరు రంగం నుంచి అదృశ్యమయ్యారు.
జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తితో తాను రాజకీయాలలోకి ప్రవేశించినట్లు అర్జున్ సింగ్ చెబుతుంటారు. సంజయ్ గాంధి దృష్టిలో పడిన అర్జున్ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రవేశపెట్టిన టెండూ పట్టా విధానం పేద గిరిజనులు పొగాకు సేద్యం సాగించడానికి దోహదం చేసింది. అయితే, వెంటనే ఆయనను వివాదాలు వెన్నంటి సాగాయి. చుర్హట్ లాటరీ కుంభకోణంలో అర్జున్ సింగ్ కుమారుని పాత్రపై వచ్చిన కోర్టు కేసులు ఆయనను చుట్టుముట్టాయి. కోర్టు వివాదాలు ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించాయి.
1984 ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించిన అనంతరం రాజీవ్ గాంధి పార్టీలో పదవులలో నిలదొక్కుకుపోయిన నాయకులను, 'పవర్ బ్రోకర్లను' వదిలించుకోవాలనే ఆత్రుత కనబరిచారు. తీవ్రవాదుల బెడదను ఎదుర్కొంటున్న పంజాబ్ లో ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో అర్జున్ సింగ్ ను రాజీవ్ గవర్నర్ గా పంపారు. అప్పట్లో పంజాబ్ రాష్ట్రపతి పాలనలో ఉంది. ఒక ఏడాది లోపే పంజాబ్ ఒప్పందంగా పేరొందిన రాజీవ్ - లోంగోవాల్ సంధిపై సంతకాలు జరిగాయి. అర్జున్ సింగ్ దక్షిణ ఢిల్లీ పార్లమెంటరీ ఉప ఎన్నికలో గెలిచి కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు.
Pages: 1 -2- News Posted: 23 May, 2009
|