మళ్ళీ సేవకు వేళాయెరా!
హైదరాబాద్ : హోరాహోరీ పోరులో కోట్లు ఖర్చుపెట్టి, కాళ్ళు అరిగేలా తిరిగి, కనబడ్డ ప్రతివాడికీ నమస్కారం పెట్టి, చివరకు చచ్చీచెడీ గెలిచిన మన ఎమ్మెల్యేలకంటే సచివాలయంలో పవర్ ఫుల్ క్యారెక్టర్లు వున్నాయి. అధిష్టానం అనుగ్రహం కోసం నవగ్రహాల పూజలు చేసి, అమాత్య పదవిని పొందటానికి ఈ ఎమ్మెల్యేలు నానా అగచాట్లు పడుతుంటే, మంత్రి గారి బంటుగా అమాంతం కొత్త అవతారం ఎత్తడానికి వీరు సిద్ధంగా వున్నారు. సంతకం పెట్టేది మంత్రే అయినా, ఫైలు పెట్టేదని నేనేననీ, మంత్రి గారి పేషీలో చక్రం తిప్పే శ్రీకృష్ణుణ్ణి తానేనని ఐదేళ్ళపాటు రాజ్యమేలే పూజారులు కొలువులో చేరడానికి కొత్త యత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రుల కంటే వారి వ్యక్తిగత కార్యదర్శులు (పిఎస్), వ్యక్తిగత సహాయకులు (పిఎ) శక్తి మంతులుగా చలామణి అవుతారు. మంత్రిగారు రమ్మని ఆహ్వానించినా పిఏ గారి అనుమతి లేనిదే దర్శనం దొరకని సందర్భాలు కోకొల్లలు. పూజారికి ముడుపు ముడితేనే గాని దైవ దర్శనం సులభ సాధ్యం కాదనేది సామాన్యుని అనుభవం.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ఉద్యోగాలలో ఆరితేరిపోయిన సిబ్బందికి ఫర్వాలేదు. సంవత్సరాల తరబడి ఈప్రత్యేక విధుల్లో సేవలందించటానికి సర్వ వేళలా సిద్దంగా వుంటారు. మంత్రి వర్యులతో సమానంగా ఏసీ ప్రయాణాలు చేస్తూ రాచవైభోగాలు అనుభవించడానికి అలవాటు పడిపోయిన ప్రాణులు. గతంలో అటవీ శాఖామంత్రి శత్రుచర్ల వంటి వారిదగ్గర పనిచేసిన ఉద్యోగులు అవినీతి సామ్రాట్టులని పత్రికల పతాక శీర్షికల్లోసైతం చోటు సంపాదించుకున్నాయి. ఏదోఒక మంత్రి దగ్గర వ్యక్తిగత సిబ్బందిగా చేరితే అయిదేళ్లలో `జీతం' కంటే `గీతం' రూపంలో ఎక్కువ లాభాలు చేకూరడం తథ్యం. తెలుగుదేశం హయాంలో మంత్రిగా వున్న పతివాడ నారాయణ స్వామి దగ్గర పనిచేసిన కమలాకర్ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి బొత్స సత్తిబాబు దగ్గర కూడా అయిదేళ్ళూ విజయవంతంగా నమ్మిన బంటులా పనిచేస్తున్నారు. మరో అయిదేళ్ళు మంత్రిసేవలో తరించే అవకాశాన్ని పొందటం ఆయనకి అంత కష్టం కాకపోవచ్చు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. గత పదిహేను, ఇరవై ఏళ్ళుగా ఈ వుద్యోగాల రుచి మరిగిన సిబ్బంది మరో మారు సచివాలయం నియామకపు పెద్దల చుట్టూ ప్రదిక్షణలు మొదలు పెట్టేశారు. ఈ నియామకపు వ్యవహారాల్లో `దక్షిణలు' బాగానే ముట్టజెప్పుకుంటారని సచివాలయం అంతా ఒకటే గుసగుసలు.
Pages: 1 -2- News Posted: 25 May, 2009
|